Allu Arjun: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే

హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే?

Published : 29 Mar 2024 00:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun)కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక మేడమ్‌ టుస్సాడ్స్‌ (madame tussauds) మ్యూజియం- దుబాయ్‌లో ఆయన మైనపు విగ్రహం (allu arjun wax statue) కొలువుదీరింది. ఆ విగ్రహాన్ని స్వయంగా అర్జున్‌ గురువారం సాయంత్రం ఆవిష్కరించారు (allu arjun unveils his wax statue). దానితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేస్తూ.. టుస్సాడ్స్‌లో విగ్రహం ఉండడం ప్రతి నటుడికీ మరుపురాని జ్ఞాపకమంటూ ఆనందం వ్యక్తం చేశారు. హీరోగా అర్జున్‌ నటించి తొలి చిత్రం ‘గంగోత్రి’ (2003) విడుదలైన రోజునే విగ్రహావిష్కరణ జరగడం విశేషం. తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ.. తనను ఆదరించిన ప్రేక్షకులు, ప్రేమ కురిపించే అభిమానులు, తన 21 ఏళ్ల జర్నీలో భాగమైన వారందరికీ బన్నీ కృతజ్ఞతలు తెలిపారు.

తొలి ప్రయత్నంలోనే మెప్పించిన ఈ హీరో ‘ఆర్య’తో విశేష క్రేజ్‌ సొంతం చేసుకున్నారు. ‘బన్నీ’, ‘దేశముదురు’, ‘వేదం’, ‘జులాయి’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘రేసుగుర్రం’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’, ‘సరైనోడు’, ‘అల వైకుంఠపురములో’.. ఇలా సినిమాసినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో వచ్చిన ‘పుష్ప: ది రైజ్‌’ (Pushpa)తో అంతర్జాతీయ స్థాయిలో మెరిశారు. ఇందులోని నటనకుగాను జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ పురస్కారం దక్కించుకున్న తొలి తెలుగు నటుడిగా నిలిచారు. ఫిబ్రవరిలో జరిగిన బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో భారతీయ సినిమా తరఫున ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ‘పుష్ప 2’తో బిజీగా ఉన్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈ ఆగస్టు 15న విడుదల కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని