Nikhil: కేంద్ర మంత్రి అమిత్‌షా పిలిచారు.. ఆ కారణంతోనే వెళ్లలేదు: నిఖిల్‌

Nikhil: నిఖిల్‌ కథానాయకుడిగా గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పై’. ఇటీవల టీజర్‌ విడుదల సందర్భంగా హీరో నిఖిల్‌ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Updated : 16 May 2023 18:51 IST

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి అమిత్‌ షాను కలిసేందుకు తనకు ఆహ్వానం వచ్చిందని, అయితే, ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని వెళ్లలేదని యువ కథానాయకుడు నిఖిల్‌ (Nikhil) అన్నారు. తనని ఆహ్వానించినందుకు అమిత్‌షాకు కృతజ్ఞతలు తెలిపారు. నిఖిల్‌ కథానాయకుడిగా గ్యారీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పై’(SPY). తాజాగా విడుదలైన టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో సాగే కథతో ‘స్పై’ తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం చిత్ర చూస్తే అర్థమవుతోంది.

టీజర్‌ విడుదల సందర్భంగా అనేక విషయాలపై నిఖిల్ స్పష్టత ఇచ్చారు. కల్యాణ్‌రామ్‌ ‘డెవిల్‌’, ‘స్పై’ రెండూ కథలు ఒకటేనని టాక్‌ వినిపిస్తోంది? మీరేమంటారు? అని అడగ్గా, ‘‘అది డిఫరెంట్‌ స్టోరీ. 1920 నేపథ్యంలో సాగుతుంది. ‘స్పై’ ప్రస్తుత కాలానికి సంబంధించింది. రెండూ నేపథ్యాలు వేరు. మీరు ఆ రెండింటినీ పోల్చలేరు. రెండు సినిమాల కథలు పూర్తిగా వేరు. రెండు సినిమాలను ఆస్వాదిస్తారు. మా మూవీ టీజర్‌ రిలీజ్‌ అయిన తర్వాతే కల్యాణ్ రామ్ సినిమా కూడా సుభాష్ చంద్రబోస్ మీదే వస్తుందనే విషయం తెలిసింది. మేం వాళ్లతో మాట్లాడాం. ఈ రెండు సినిమాలకూ ఎలాంటి సంబంధం లేదు. అలాగే, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. జెండాలు అజెండాలు లేవు. నిజాయతీతో తీసిన చిత్రమిది. నిజమైన రా ఏజెంట్లులా మేం శిక్షణ తీసుకున్నాం. నేను ఏ పార్టీకీ అనుకూలంగా సినిమాలు తీయడం లేదు. ఒక భారతీయుడిలా ఈ సినిమా చేస్తున్నా. కృష్ణుడిపై ఉన్న భక్తి భావంతోనే ‘కార్తికేయ2’ ఒప్పుకొన్నా. కేంద్ర మంత్రులతో పాటు, ప్రతి పక్ష నాయకులకీ ‘స్పై’ సినిమా చూపిస్తాం’’ అని నిఖిల్‌ వివరించారు.

‘కార్తికేయ2’ విజయం తర్వాత ‘స్పై’ సినిమాకు బడ్జెట్‌ పెంచారట కదా! అని అడగ్గా దర్శకుడు గ్యారీ స్పందిస్తూ.. ‘‘అలాంటిదేమీ లేదు. ముందుగా అనుకున్న దాని ప్రకారమే ఈ సినిమా రూపొందుతోంది. తొలి సినిమా తీస్తున్న దర్శకుడిని నమ్మి ఈ స్థాయిలో ఎవరూ డబ్బులు పెట్టరు. నిర్మాత మేము చెప్పిన కథను నమ్మారు. ‘కార్తికేయ2’ కన్నా ముందే సినిమాను మొదలు పెట్టినా, రీసెర్చ్‌ కోసం ఆలస్యమైంది. ఈ కథా నేపథ్యానికి తగినట్లు లొకేషన్స్‌ వెతకడం ఆలస్యమైంది. సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రాల ఆధారంగానే స్పై సినిమా తెరకెక్కిస్తున్నాం. 10శాతం మాత్రమే కల్పితం ఉంటుంది. మిగతాదంతా ప్రభుత్వం వెల్లడించిన సమాచారం ఆధారంగానే తీశాం’’ అని దర్శకుడు గ్యారీ అన్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య మేనన్‌ కథానాయికగా నటిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని