Nikhil Siddharth: నన్నూ డ్రగ్స్‌ తీసుకోమన్నారు: యువ కథానాయకుడు నిఖిల్‌

Nikhil Siddharth: విద్యార్థి దశ ఎంతో అందమైనదని, మాదక ద్రవ్యాలకు బానిసలై అలాంటి చక్కటి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సినీ నటుడు సిద్ధార్థ్‌ అన్నారు.

Updated : 24 Jun 2023 19:00 IST

హైదరాబాద్‌: మాదక ద్రవ్యాలకు అందరూ దూరంగా ఉండాలని, ఒకసారి వాటికి అలవాటు పడితే, ఇక మరణమేనని యువ కథానాయకుడు నిఖిల్‌ (Nikhil Siddharth) అన్నారు. శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదకద్రవ్యాల నిరోధక విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన ‘పరివర్తన’ కార్యక్రమంలో మరో నటుడు ప్రియదర్శితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్‌ మాట్లాడుతూ.. తనని కూడా చాలాసార్లు డ్రగ్స్‌ తీసుకోమని కొందరు అడిగారని అయితే, అలాంటి వాటికి తాను ఎప్పుడూ దూరంగా ఉంటానని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలని హితవు పలికారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎంతో అందమైన జీవితం ఉందని, దాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అన్నారు. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్‌ తీసుకోవద్దని కోరారు. త్వరలోనే మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ అవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ఈ సందర్భంగా హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్ మాట్లాడతూ.. ‘తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను కొద్దిరోజుల క్రితమే ప్రారంభించాం. డ్రగ్స్ అనేది ప్రస్తుత సమాజంలో పెద్ద సమస్యగా మారింది. దేశవ్యాప్తంగా దాదాపు 11 కోట్ల మంది డ్రగ్స్‌కు బానిసలయ్యారు. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్ నుంచి వివిధ మార్గాల్లో డ్రగ్స్ ఇక్కడికి చేరవేస్తున్నారు. సైబర్ క్రైమ్, నార్కోటిక్స్ రెండూ ప్రధాన సమస్యలు. ఎంతో మంది విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. ఈ పరివర్తన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో మార్పు రావాలి. డ్రగ్స్ నిర్మూలనకు అందరూ సహకరించాలి’ అని అన్నారు.

ఒకప్పుడు సిగరెట్‌ కాల్చేవాడిని: ప్రియదర్శి

ఒకప్పుడు తానూ సిగరెట్‌ కాల్చేవాడినని నటుడు ప్రియదర్శి అన్నారు. పరివర్తన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సిగరెట్‌కు బానిస కావొద్దని సంకల్పించిన వెంటనే మానేశానని అన్నారు. ఇప్పుడు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. డ్రగ్స్ వల్ల కలిగే దుష్పరిణామాలు ఏంటి? అవి ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి? వంటి అంశాలపై అందరికి అవగాహన రావాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల కోసం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నార్కోటిక్స్ విభాగం చేయడం సంతోషంగా ఉందన్నారు. మాదక ద్రవ్యాల నిరోధానికి కృషి చేస్తున్న నార్కోటిక్స్ విభాగం పోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు