Hi Nanna: అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన ‘హాయ్‌ నాన్న’.. ఏకంగా 11 అవార్డులు సొంతం

నాని హీరోగా నటించిన ‘హాయ్‌ నాన్న’కు అంతర్జాతీయంగా ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా 11 అవార్డులను సొంతం చేసుకుంది.

Published : 09 Apr 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శౌర్యవ్‌ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. తండ్రీ, కూతురు సెంటిమెంట్‌తో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులతో పాటు ఇప్పటికే పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. తాజాగా అంతర్జాతీయ వేదికపైనా సత్తా చాటింది. న్యూయార్క్‌లో జరిగిన ‘ది ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డుల్లో’ హాయ్‌ నాన్న ఉత్తమ చిత్రంతో సహా మొత్తం 11 అవార్డులను సొంతం చేసుకుంది.

ఈ విషయంపై దర్శకుడు ఆనందం వ్యక్తం చేస్తూ.. ‘ఇంత ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది. హయ్‌ నాన్న కోసం మేమంతా పడిన కష్టానికి ఫలితమిది. ఈ సినిమాను ఇంతగా ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. తారాగణం, సిబ్బంది సపోర్ట్‌ వల్లే ఇదంతా సాధ్యమైంది’ అన్నారు. ఉత్తమ నటిగా పురస్కారం పొందిన మృణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ సంతోషంగా ఉందన్నారు. ‘ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డులను గెలుచుకోవడం చాలా థ్రిల్‌గా ఉంది. నా కల నెరవేరింది. కథ బాగుంటే సినిమాకు ఎక్కడైనా ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాలో నేను పోషించిన య‌ష్న పాత్ర జీవితమంతా గుర్తుంటుంది. చిత్రబృందంతో పని చేయడం గొప్ప అనుభూతినిచ్చింది’ అన్నారు.

‘హాయ్‌ నాన్న’ ఒనిరోస్‌ ఫిల్మ్ అవార్డుల్లో.. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ జంట, ఉత్తమ బాలనటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ తొలి దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ సౌండ్‌ ట్రాక్‌, ఉత్తమ ఎడిటింగ్‌ల్లో విభాగాల్లో సత్తా చాటింది. ‘హాయ్‌ డాడీ’ పేరుతో ఈ చిత్రాన్ని అంతర్జాతీయంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని