Nani: ఓటీటీలోనూ అదరగొడుతోన్న ‘హాయ్‌ నాన్న’..

‘హాయ్‌ నాన్న’ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో అది ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

Published : 07 Jan 2024 19:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాని (Nani) హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’. ప్రేక్షకుల హృదయాలకు హత్తుకున్న ఈ సినిమా నాలుగు రోజుల క్రితం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడిది అక్కడ టాప్‌లో కొనసాగుతూ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఏకంగా టాప్‌ 10లో మూడు స్థానాలను సొంతం చేసుకుంది. మంచి ప్రేమ కథగా, కూతురి సెంటిమెంట్‌ మూవీగా అలరించిన ‘హాయ్‌ నాన్న’కు డిజిటల్‌ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఐదుభాషల్లో విడుదలైన ఈ చిత్రం తెలుగులో టాప్‌ వన్‌లో ఉంది. హిందీలో 5వ స్థానం, తమిళంలో 10లో నిలిచింది. దీంతో నాని ఫ్యాన్స్‌ సంబరపడుతున్నారు. మరోవైపు ఇందులోని ఎమోషనల్‌ సీన్స్‌ కూడా సోషల్ మీడియాలో షేర్‌ అవుతున్నాయి.

ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’తో బిజీగా ఉన్నారు. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో.. డి.వి.వి.ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. నాని సరసన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ నటిస్తుండగా ఎస్‌.జె.సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. భిన్నమైన కథాంశంతో ఇది రూపొందుతోంది. మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే హీరో కథగా రానుంది. యాక్షన్‌ సన్నివేశాలతో పాటు వినోదానికి కూడా ఇందులో పెద్దపీట వేయనున్నారు. దీని తర్వాత ‘బలగం’ వేణు దర్శకత్వంలో నాని ఓ సినిమా చేసే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని