Hi nanna: అమ్మ కథ చెప్పిన నాన్న

‘అనగనగా ఒక ఊరు,  అందులో నేను. నా ముందు ఓ అద్భుతం...’ అంటూ ఓ  కథ చెప్పాడు నాన్న. ఇది అమ్మ కథ అంటూ తన కూతురిని నమ్మించాడు.

Updated : 25 Nov 2023 09:42 IST
 

‘అనగనగా ఒక ఊరు,  అందులో నేను. నా ముందు ఓ అద్భుతం...’ అంటూ ఓ  కథ చెప్పాడు నాన్న. ఇది అమ్మ కథ అంటూ తన కూతురిని నమ్మించాడు. మరి ఆ కథ నిజమేనా లేక అబద్ధమా? అమ్మ పాత్రలో తనని ఊహించుకోమని చెప్పిన యష్ణ ఎవరు? ఆమె కథేమిటో తెలియాలంటే ‘హాయ్‌ నాన్న’ చూడాల్సిందే. నాని కథానాయకుడిగా నటించిన చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబి కియారా ఖన్నా కీలక పాత్ర పోషించింది. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి, డా.విజేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్నారు. డిసెంబరు 7న తెలుగుతోపాటు, తమిళ,  కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మ, నాన్న, కూతురు నేపథ్యంలో సాగే ఓ ప్రేమకథతో ఈ చిత్రం రూపొందినట్టు ట్రైలర్‌నిబట్టి స్పష్టమవుతోంది. ఈ సినిమాకి ఛాయాగ్రహణం: సాను జాన్‌ వర్గీస్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వహాబ్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, కూర్పు: ప్రవీణ్‌ ఆంటోని.


ఒట్టేసి చెబుతున్నా

‘‘తొలిసారి తెరపై నన్ను నేను చూసుకున్నాక ‘వీడెవడో బాగున్నాడే’ అని నాకే అనిపించింది ఈ సినిమాకే. టీజర్‌, పాటలు, థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదలై మంచి ఆదరణని సొంతం చేసుకున్నాయి. అయినా ఇప్పటిదాకా చూడనిది, ఊహించనిది సినిమాలో బోలెడంత ఉంది. ప్రతి ఒక్కరూ ఈ  సినిమాతో ప్రేమలో పడతారు. సినిమా అనేది నాకు ఆక్సిజన్‌తో సమానం. నాకు ఊపిరి. దానిపై ఒట్టేసి చెబుతున్నా. డిసెంబర్‌ 7న అందరూ ప్రేమలో పడిపోయే సినిమా వస్తుంది. ఆ బాధ్యత నాది, మా బృందం అందరిదీ. బాక్సాఫీస్‌ బాధ్యత ప్రేక్షకులది. ప్రారంభం రోజుల నుంచీ నేను కొత్త ప్రయత్నం చేసిన ప్రతిసారీ ‘ఇది చూడరు, ఇది రిస్క్‌’ అనే మాటలు వింటూనే ఉన్నా. కానీ ప్రతిసారీ ఆ మాటలు తప్పు అని ప్రేక్షకులు నిరూపిస్తూనే ఉన్నారు. ఇలాంటి ప్రేక్షకులు ఉండటం మా అదృష్టం’’.

 ట్రైలర్‌ విడుదల వేడుకలో నాని


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని