merry christmas ott: ఓటీటీలో ‘మెర్రీ క్రిస్మస్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Merry Christmas ott release date: కత్రినాకైఫ్‌, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ‘మెర్రీ క్రిస్మస్‌’ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

Updated : 07 Mar 2024 15:07 IST

హైదరాబాద్‌: కత్రినా కైఫ్‌, విజయ్‌ సేతుపతి జంటగా నటించిన క్రైమ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మెర్రీ క్రిస్మస్‌’ (Merry Christmas). శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకుడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో మార్చి 8వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ (Merry Christmas ott release) కానుంది. హిందీతో పాటు, తమిళ, తెలుగు భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్‌ ఇండియా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: ఏడేళ్ల జైలు జీవితం తర్వాత అల్బ‌ర్ట్ (విజ‌య్ సేతుప‌తి) ముంబయి నగరంలోకి అడుగుపెడ‌తాడు. చ‌నిపోయిన అమ్మ జ్ఞాప‌కాలు గుర్తొచ్చి పండుగ రోజు ఇంట్లో ఉండ‌లేక‌, హోట‌ల్‌కు వెళ‌తాడు. అక్క‌డే మరియా (కత్రినా) తార‌స‌ప‌డుతుంది.  ఆమెకు తానొక ఆర్కిటెక్ట్‌గా ప‌రిచ‌యం చేసుకుంటాడు అల్బ‌ర్ట్‌. భ‌ర్త జెరోమీపై ద్వేషంతో అల్బ‌ర్ట్‌ను డేట్ కోసం త‌న ఇంటికి తీసుకొస్తుంది మ‌రియా. అనుకోకుండా జెరోమీ డెడ్‌బాడీ ఇంట్లో క‌నిపిస్తుంది. అత‌డిని ఎవ‌రో షూట్ చేసి చంపేస్తారు. మ‌రియా పోలీసుల‌కు ఫోన్ చేయాల‌ని అనుకుంటుంది. కానీ అల్బ‌ర్ట్ వ‌ద్ద‌ని వారిస్తాడు. తాను ఆర్కిటెక్ట్ కాద‌ని...జైలు నుంచి విడుద‌లైన ఖైదీన‌ని మ‌రియాకు చెబుతాడు. న‌న్ను నీతో చూస్తే పోలీసులు అనుమానిస్తార‌ని, అది నీకే ప్ర‌మాద‌మ‌ంటాడు.  త‌న‌తో అబ‌ద్దం చెప్పిన అల్బ‌ర్ట్‌ను ఇంట్లో నుంచి పంపిచేస్తుంది మ‌రియా. ఆ త‌ర్వాత రోనీ అనే మ‌రో వ్య‌క్తిని మ‌రియా ఇంటికి తీసుకొస్తుంది. అస‌లు మ‌రియా ఇంట్లో ఏం జ‌రిగింది? జెరోమీని చంపింది ఎవ‌రు? అల్బ‌ర్ట్ ఎందుకు జైలుకు వెళ్లాడు? ప్రాణంగా ప్రేమించిన రోజీని (రాధికా ఆప్టే) అల్బ‌ర్ట్ ఎందుకు చంపాడు? మ‌రియా కోసం అల్బ‌ర్ట్ ఎలాంటి త్యాగానికి సిద్ధ‌ప‌డ్డాడు? జెరోమీని చంపిన దోషిని పోలీసులు ప‌ట్టుకున్నారా? లేదా? అన్నది చిత్ర కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని