కిస్‌ సీన్స్‌ కాంట్రవర్సీ.. స్పందించిన సందీప్‌ రెడ్డి వంగా

‘యానిమల్‌’ (Animal) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఇందులో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత చిత్రం ‘కబీర్‌సింగ్‌’ (Kabir Singh) గురించి ఆయన మాట్లాడారు.

Published : 01 Dec 2023 19:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కబీర్‌సింగ్‌’ (Kabir Singh)తో తొలి ప్రయత్నంలోనే బాలీవుడ్‌లో విజయాన్ని అందుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో షాహిద్‌ కపూర్‌, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులపై చిత్రీకరించిన ముద్దు సీన్స్‌ అప్పట్లో చర్చకు దారి తీశాయి. ఆ సీన్స్‌ను పలువురు తప్పుబట్టారు. ఈ విషయంపై ఇటీవల ‘యానిమల్‌’ ఇంటర్వ్యూలో సందీప్‌ స్పందించారు. వాళ్ల మాటలను తాను పెద్దగా పట్టించుకోలేదన్నారు.

‘‘వాళ్ల మాటలను నేను పెద్దగా పట్టించుకోలేదు. ‘కబీర్‌సింగ్‌’ మహిళలను తక్కువగా చూపించిన చిత్రం అయితే కాదు. ఐదారుగురు మాత్రమే ఆ సినిమాలోని సన్నివేశాలను తప్పుబట్టారు. వాళ్లే ఏవేవో కథనాలు రాశారు. వాటిని ఆధారంగా చేసుకుని మరి కొందరు వార్తలు సృష్టించారు. అది కేవలం వాళ్ల అభిప్రాయం మాత్రమే’’ అని సందీప్‌ తెలిపారు. మరోవైపు, ‘కబీర్‌ సింగ్‌’లో భాగం కాకపోవడంపై ‘అర్జున్‌రెడ్డి’ ఫేమ్‌ షాలినీపాండే మాట్లాడారు. ‘కబీర్‌సింగ్‌’లోకి తనని ఎంచుకోనందుకు తాను ఏమాత్రం బాధపడలేదన్నారు. షాహిద్‌ - కియారా యాక్టింగ్‌ తనకెంతో నచ్చిందని చెప్పారు. ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌గా ‘కబీర్‌సింగ్‌’ రూపుదిద్దుకుంది. రణ్‌వీర్‌ సింగ్‌తో ఈ సినిమా చేయాలని మొదట సందీప్‌ భావించారు. కాకపోతే అది కుదరలేదు.

రివ్యూ: యానిమల్‌.. రణ్‌బీర్‌-సందీప్‌ వంగా యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

సందీప్‌ దర్శకత్వం వహించిన రీసెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’. రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక జంటగా నటించారు. తండ్రీ తనయుల సెంటిమెంట్‌తో ఈ సినిమా సిద్ధమైంది. ఇందులో హీరోయిన్‌గా తొలుత పరిణీతి చోప్రాను ఎంచుకున్నామని.. లుక్‌ టెస్ట్‌ తర్వాత ఆమెను స్థానంలో రష్మికను ఫైనల్‌ చేశామని ఇటీవల సందీప్‌ చెప్పారు. ఎన్నో అంచనాల మధ్య తాజాగా ‘యానిమల్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రణ్‌బీర్‌ కపూర్‌ యాక్టింగ్‌.. సందీప్‌ మార్క్‌ మేకింగ్‌కు సినీ ప్రియులు ఫిదా అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని