The Kashmir Files: ‘కశ్మీర్‌ ఫైల్స్‌’పై ఇఫి జ్యూరీ హెడ్‌ సంచలన వ్యాఖ్యలు.. అనుపమ్ ఖేర్‌ ఆగ్రహం

‘ది కశ్మీర్‌ పైల్స్‌’ చిత్రంపై ఇఫి జ్యూరీ హెడ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆయన వ్యాఖ్యల పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 29 Nov 2022 11:01 IST

పనాజీ: అంతర్జాతీయ భారతీయ చలనచిత్ర వేడుకల్లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించడం దుమారానికి దారితీసింది. ఇది ‘అసభ్యకర’ చిత్రమంటూ జ్యూరీ అధినేత, ఇజ్రాయెల్‌ దర్శకుడు నడవ్‌ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో స్పందించిన జ్యూరీ బోర్డు.. అది ఆయన ‘వ్యక్తిగత అభిప్రాయం’ అంటూ వివాదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. మరోవైపు.. లాపిడ్‌ వ్యాఖ్యలను భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి ఖండిస్తూ.. కేంద్ర ప్రభుత్వానికి క్షమాపణలు తెలిపారు. అసలేం జరిగిందంటే..

గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం (ఇఫి)లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రాన్ని ప్రదర్శించారు. దీనిపై ఇఫి జ్యూరీ హెడ్‌ నడవ్‌ లాపిడ్‌ ముగింపు వేడుకల్లో మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చూసి దిగ్భ్రాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు. కళలకు, జీవితానికి అవసరమైన విమర్శనాత్మక చర్చకు ఈ ఫెస్టివల్‌ ఎప్పటికీ స్వాగతిస్తుంది. అందుకే నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెబుతున్నా’’ అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు సిగ్గుచేటు: అనుపమ్‌ ఖేర్‌

అయితే లాపిడ్‌ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కశ్మీరీ పండిట్ల బాధల పట్ల ఆయనకు ఎలాంటి విచారం లేదంటూ కొందరు విమర్శించారు. దీంతో ఇది కాస్తా వివాదాస్పదమైంది. లాపిడ్‌ వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యూదులపై దారుణమైన మారణహోమం వంటి బాధలను అనుభవించిన వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. నాడు యూదులపై నరమేధం నిజమైతే.. కశ్మీరీ పండిట్ల ఊచకోత కూడా నిజమే. దేవుడు ఆయనకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నా’’ అని విమర్శించారు.  అటు ఈ చిత్ర దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి కూడా ట్విటర్‌లో స్పందించారు. ‘నిజం చాలా ప్రమాదకరమైనది. ఇది ప్రజలతో అబద్దాలు చెప్పించగలదు’ అంటూ ట్వీట్ చేశారు.

అది ఆయన వ్యక్తిగత నిర్ణయమే: జ్యూరీ బోర్డు

ఈ నేపథ్యంలోనే ఇఫి జ్యూరీ బోర్డు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌ ఫైల్స్‌ చిత్రంపై లాపిడ్ చేసిన వ్యాఖ్యలు.. పూర్తిగా ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని, దీనిపై జ్యూరీ బోర్డుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ‘‘జ్యూరీ సభ్యులుగా.. ఒక సినిమా సాంకేతికత, నాణ్యత, సామాజిక-సాంస్కృతిక ఔచిత్యాన్ని మాత్రమే మేం అంచనా వేస్తాం. అంతేగానీ సినిమాలపై ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేయబోం. ఒకవేళ జ్యూరీ సభ్యులెవరైనా అలా చేస్తే.. అది పూర్తిగా వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే’’ అని జ్యూరీ బోర్డు ప్రకటనలో పేర్కొంది.

క్షమించండి: ఇజ్రాయెల్‌ రాయబారి

ఇజ్రాయెల్‌ దర్శకుడి వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపడంతో భారత్‌లో ఇజ్రాయెల్‌ రాయబారి నావొర్‌ గిలాన్‌ స్పందించారు. లాపిడ్‌ వ్యాఖ్యలను ఖండించిన ఆయన.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు. ‘‘భారతీయ సంప్రదాయంలో అతిథిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి దేశానికి వచ్చి ఇఫిలో జడ్జీ ప్యానెల్‌కు హెడ్‌గా ఉన్న మీరు(లాపిడ్‌).. ఆతిథ్యమిచ్చిన దేశాన్నే అవమానించారు. చారిత్రక ఘటనల గురించి పూర్తిగా తెలుసుకోకుండా వాటికి గురించి వ్యాఖ్యానించడం సరికాదు. మీ వ్యాఖ్యల పట్ల ఇజ్రాయెల్‌ దేశస్థుడిగా నేను సిగ్గుపడుతున్నా. భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని గిలాన్‌ ట్విటర్‌లో సుదీర్ఘ పోస్టులు పెట్టారు.

ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించిన ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రం ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషీ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఇఫిలో ఇండియన్‌ పనోరమ సెక్షన్‌లో భాగంగా నవంబరు 22న ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని