Nelson: ఎదురుదెబ్బలు తిన్నా.. తలొగ్గని బీస్ట్‌.. నెల్సన్‌ దిలీప్‌ ప్రయాణమిదే!

‘జైలర్‌’ (Jailer) దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilipkumar)కు సంబంధించిన ఆసక్తికర విశేషాలు..!

Published : 08 Aug 2023 11:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌.. పిల్లల అక్రమ రవాణా.. టెర్రరిజం.. వంటి సీరియస్‌ కథాంశాలకు ‘డార్క్‌ కామెడీ’ జోడించి విభిన్నమైన చిత్రాలు తెరకెక్కించారు కోలీవుడ్‌ దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilip Kumar). కెరీర్‌ ఆరంభంలోనే అగ్ర తారలతో సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘జైలర్‌’ (Jailer). సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా సిద్ధమైన ఈ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌తో ఇప్పటికే సినీ ప్రియుల ప్రశంసలు అందుకున్న నెల్సన్‌ దిలీప్‌ ‘స్టార్ట్‌.. కెమెరా.. యాక్షన్‌’ను ఎలా మొదలుపెట్టారంటే..

స్టార్ట్‌..!

చెన్నైకు చెందిన నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ (Nelson Dilip Kumar) విజువల్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తైన వెంటనే ఆయన ఓ టెలివిజన్‌ సంస్థలో ఉద్యోగానికి చేరారు. అసిస్టెంట్‌ స్క్రిప్ట్‌ రైటర్‌గా కెరీర్‌ మొదలుపెట్టారు. ఏదో సాధించాలనే తపనతో నిరంతరం కష్టపడి వర్క్‌ చేసేవారు. టెలివిజన్‌ ఇండస్ట్రీలోనే సెటిలైపోవాలని ఎన్నోకలలు కన్నారు. అక్కడ వర్క్‌ చేస్తున్న సమయంలోనే ఆయనకు శివ కార్తికేయన్‌, అనిరుధ్‌తో స్నేహం కుదిరింది.


కెమెరా..!

నెల్సన్‌ను సినిమాకు పరిచయం చేసింది ఆయన తండ్రి. ప్రముఖ దర్శకులు సీవీ. శ్రీధర్‌, స్టీవెన్ స్పీల్‌బర్గ్ చిత్రాలంటే నెల్సన్‌ తండ్రికి ఎంతో ఇష్టం. అలా, ఆయన కూడా ఆయా దర్శకుల చిత్రాలు చూడటం అలవాటు చేసుకుని సినిమా మేకింగ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. 2010లో దర్శకుడిగా తొలి అడుగువేశారు. శింబు-హన్సిక జంటగా ‘వేటై మన్నన్‌’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అనుకోని కారణాలతో ఆ సినిమా ఆదిలోనే అటకెక్కింది. 2017లో దీనిని తిరిగి మొదలు పెట్టాలని చూసినప్పటికీ నిరాశే ఎదురైంది. ఇలా, ఆరంభంలోనే నెల్సన్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి.

‘ఆమె’గా మారి.. నవ్వులు పంచి.. లేడీ గెటప్‌ వేసిన హీరోలు వీరే!


యాక్షన్‌..!

‘వేటై మన్నన్‌’ అర్ధాంతరంగా ఆగిపోవడంతో నెల్సన్‌ తిరిగి టీవీ గూటికి చేరారు. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఆయన మెగా ఫోన్‌ పట్టలేదు. ప్రేక్షకులకు కొత్తగా వినోదం అందించాలనుకున్నారు. తనకు ఇష్టమైన దర్శకుల చిత్రాలను రిపీట్‌ మోడ్‌లో చూస్తూ తన క్రాఫ్ట్‌ను మెరుగుపరచుకున్నారు. ఈ క్రమంలో అవమానాలు ఎదురైనప్పటికీ బాధపడలేదు. దర్శకుడిగా నిరూపించుకునేందుకు ఆత్మస్థైర్యంతో పరిశ్రమలోకి అడుగుపెట్టారు. తన స్నేహితుడు అనిరుధ్‌ సాయం చేయడంతో అగ్ర నటి నయనతార (Nayanthara)తో ‘కొలమావు కోకిల’ (Kolamaavu Kokila)ను రూపొందించారు. డ్రగ్స్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా 2018లో విడుదలై తమిళం, తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. నెల్సన్‌ స్క్రీన్‌ప్లే. నయన్‌ నటన, యోగిబాబు కామెడీ ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. ‘కొలమావు కోకిల’ సక్సెస్‌తో నెల్సన్‌ దర్శకుడిగా యాక్షన్‌ మొదలుపెట్టారు.


బాక్సాఫీస్‌ హిట్‌..!

‘కొలమావు కోకిల’ విజయం తర్వాత తన ఆప్త మిత్రుడు శివ కార్తికేయన్‌ (Siva Karthikeyan) తో నెల్సన్‌ సినిమా ప్రకటించారు. ‘వరుణ్‌ డాక్టర్‌’ (Varun Doctor) పేరుతో ఇది మొదలైంది. చిత్రీకరణ ఆరంభంలోనే నెల్సన్‌కు ఇబ్బంది తప్పలేదు. సినిమా నుంచి తాము వైదొలగుతున్నామంటూ చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. నెల్సన్‌ టాలెంట్‌ను నమ్మిన శివ కార్తికేయన్‌.. తానే నిర్మాతగా చేస్తానంటూ ముందుకొచ్చారు. శివ కార్తికేయన్‌ ప్రొడెక్షన్స్‌ బ్యానర్‌పై రూ.40 కోట్ల బడ్జెట్‌తో సిద్ధమైన ఈ సినిమా బాక్సాఫీస్‌ రూ.100 కోట్లు వసూళ్లు చేసింది. చిన్న పిల్లల కిడ్నాప్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో మేజర్‌, డాక్టర్‌గా వరుణ్‌ నటన, యోగిబాబు కామెడీకి సినీ ప్రేమికులు కడుపుబ్బా నవ్వుకున్నారు.


కలిసిరాని కాలం..!

నెల్సన్‌.. తన వర్కింగ్ స్టైల్‌తో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ (Vijay) దృష్టిని ఆకర్షించారు. తన మూడో చిత్రాన్ని విజయ్‌తో చేశారు. టెర్రరిజం, రా ఏజెంట్‌ నేపథ్యంలో సిద్ధమైన ఈ చిత్రం ‘బీస్ట్‌’ (Beast)గా విడుదలైంది. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్‌ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. విజయ్‌ స్టైల్‌, అనిరుధ్‌ సాంగ్స్‌ బాగున్నప్పటికీ.. సినిమా సక్సెస్‌ కాలేకపోయింది. ఈ సినిమా పరాజయం తర్వాత నెల్సన్‌ను ఎంతోమంది నిందించారు. ‘రా’ ఏజెంట్‌గా హీరో పాత్రను చిత్రీకరించడంలో నెల్సన్‌ పరాజయం పొందారంటూ హీరో తండ్రి కూడా విమర్శించారు. ఇదిలా ఉండగా.. ‘బీస్ట్‌’ రిలీజైన సమయంలోనే ‘కేజీయఫ్‌ 2’ కూడా విడుదలైంది. ‘కేజీయఫ్‌ 2’ రిలీజ్‌ ప్రభావం ఈ సినిమాపై పడిందని పలువురు నిపుణులు విశ్లేషించారు.


విజిల్‌ మార్‌..!

‘బీస్ట్‌’ (Beast) చేస్తున్నప్పుడే నెల్సన్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) తో ప్రకటించారు. విజయ్‌ సినిమా ఫలితం తర్వాత నెల్సన్‌తో సినిమా చేయవద్దంటూ పలువురు రజనీతో చెప్పారు. టాలెంట్‌ను మాత్రమే నమ్మిన రజనీ వారి మాటలు లెక్కచేయలేదు. నెల్సన్‌ - రజనీకాంత్‌ కాంబోలో సిద్ధమైన చిత్రం ‘జైలర్‌’ (Jailer). సినిమా పట్టాలెక్కిన నాటి నుంచి ఎంతోమంది నెల్సన్‌ను టార్గెట్ చేస్తూ సోషల్‌మీడియాలో నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారు. వారి విమర్శలకు బదులిస్తూ ఇటీవల ‘జైలర్‌’ ట్రైలర్‌ విడుదలైంది. దాదాపు రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోతో  రజనీకాంత్‌ పాత్ర చిత్రీకరణను పరిచయం చేశారు. రజనీ స్టైల్‌ను చూసి నెటిజన్లు ‘విజిల్‌ మార్‌’ అంటూ కామెంట్స్‌ చేశారు. మోహన్‌లాల్‌, సునీల్‌, జాకీ ష్రాఫ్‌, రమ్యకృష్ణ, తమన్నా కీలకపాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

కెరీర్‌లో ఇప్పటివరకూ తనకు ఎదురైన ఇబ్బందుల గురించి గతంలో ఓ ఇంటర్వ్యూలో నెల్సన్‌ మాట్లాడారు. ‘‘ఇబ్బందులు ఎదురైన సమయంలో నేను నమ్మకాన్ని కోల్పోలేదు. సినిమా రంగంలో ఉండాలంటే మనం ప్రతి రోజూ నేర్చుకుంటూనే ఉండాలి. ఏదో ఒకరోజు తప్పకుండా నీకొక అవకాశం వస్తుంది. ఆరోజు నిన్ను నువ్వు నిరూపించుకోక తప్పదు. నీ క్రాఫ్ట్‌, కంటెంట్‌ మంచిగా ఉంటే అద్భుతమైన వర్క్‌తో ప్రేక్షకుల అలరించవచ్చు’’ అని నెల్సన్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని