Heroes in Lady Getup: ‘ఆమె’గా మారి.. నవ్వులు పంచి.. లేడీ గెటప్‌ వేసిన హీరోలు వీరే!

లేడీ గెటప్పులో నటించి, ప్రేక్షకులకు వినోదం పంచిన హీరోలపై ప్రత్యేక కథనం. ఏ హీరో ఏ సినిమా కోసం మహిళగా కనిపించారంటే?

Published : 02 Aug 2023 10:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల విడుదలైన ‘డ్రీమ్‌గర్ల్‌ 2’ (Dream Girl 2) సినిమా పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. బాలీవుడ్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana) అమ్మాయిగా కనిపించడమే అందుకు కారణం. ‘డ్రీమ్‌గర్ల్‌’ (Dream Girl) సినిమాలోనూ అమ్మాయిగా నటించి, మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఇప్పుడు సీక్వెల్‌తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. రాజ్‌ శాండిల్యా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ఇప్పటికే ‘లేడీ గెటప్పు’లతో అలరించిన హీరోల గురించి ప్రత్యేక కథనం.

సైమా అవార్డ్స్‌ 2023.. ‘ఆర్ఆర్ఆర్‌’కు 11 నామినేషన్స్‌..!

కథలో భాగంగా ఇతర పాత్రలను మభ్యపెట్టేందుకు నటులు అప్పుడప్పుడు ఇలా మహిళలుగా మారాల్సి వస్తుంది. ఆయా సన్నివేశాల్లో ఈ ‘లేడీ గెటప్పు’ పాత్రధారులు తమ గుట్టు ఎక్కడ బయటపడుతుందేమోనని భయపడుతూనే ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతారు. క్యారెక్టర్‌ ఆర్టిస్టులు ఇలాంటి రోల్స్‌ ప్లే చేయడం సాధారణమేగానీ హీరో చేయడమే సాహసం! చిరంజీవి, రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ తదితర అగ్ర కథానాయకులు ఈ ప్రయోగం చేసి, విజయం అందుకున్నారు. వీరు అచ్చం అమ్మాయిలా కనిపించడానికి తగిన మేకప్‌తో సిద్ధమవగా, వెంకటేశ్‌, అల్లరి నరేశ్‌లాంటి వారు మీసం తీయకుండానే అమ్మాయి వేషధారణలో కనిపించి, నవ్వులు పూయించారు. కొందరు కేవలం పాటల్లోనే మహిళగా నటించారు. ఎవరెవరు ఏ సినిమాతో ఇలా వినోదం పంచారంటే?

‘చంటబ్బాయ్‌’ (Chantabbai) సినిమాలోని ‘నేనో ప్రేమ పూజారి’ పాటలో హీరోయిన్‌ సుహాసినిని ఇంప్రెస్‌ చేసేందుకు చిరంజీవి (Chiranjeevi) పలు వేషాలు వేస్తారు. అందులో ఈ లేడీ గెటప్పు ఒకటి. ఆధ్యాత్మిక చిత్రం ‘పాండురంగడు’ (Pandurangadu)లో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కొన్ని సెకన్లపాటు అమృత అనే పాత్రలోకి ప్రవేశిస్తారు. ‘టాప్‌హీరో’ చిత్రంలోనూ ఆయన మహిళగా కనిపించి, ఓ పాత్రను మాయ చేస్తారు. ‘వాసు’ (Vasu), ‘బాడీగార్డ్‌’ (Bodyguard) చిత్రాల్లో వెంకటేశ్‌ (Daggubati Venkatesh), ‘గంగోత్రి’ (Gangotri)లో అల్లు అర్జున్‌ (Allu Arjun), ‘పాండవులు పాండవులు తుమ్మెద’ (Pandavulu Pandavulu Tummeda)లో మంచు మనోజ్‌ (Manchu Manoj) లేడీ వేషంలో ఆకట్టుకున్నారు. ‘చిత్రం భళారే విచిత్రం’, ‘జంబలకడి పంబ’ సినిమాల్లో నరేశ్‌ (Naresh) చేసిన కామెడీకి పొట్టచెక్కలవ్వాల్సిందే. ‘మేడమ్‌’లో రాజేంద్ర ప్రసాద్‌ (Rajendra Prasad), ‘కితకితలు’లో అల్లరి నరేశ్‌ (Allari Naresh) మహిళా వేషంలో నటించి, మెప్పించారు.


‘అన్నర్వ మక్కళు’లో కన్నడ ప్రముఖ కథానాయకుడు శివ రాజ్‌కుమార్‌ (Shiva Rajkumar), ‘భామనే సత్యభామనే’లో కమల్‌హాసన్‌ (Kamal Haasan), ‘పనక్కరణ్‌’లోని ఓ పాటలో కోలీవుడ్‌ అగ్ర హీరో రజనీకాంత్‌ (Rajinikanth), ‘అయన్‌’ (వీడొక్కడే)లోని ఓ పాటలో సూర్య (Suriya), ‘ప్రియమనవలే’లో విజయ్‌, ‘మల్లన్న’లో విక్రమ్‌ (Vikram), ‘వాడు వీడు’లో విశాల్‌ (vishal), ‘రెమో’లో శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan) ‘ఆమె’గా ప్రేక్షకుల్ని కట్టిపడేశారు.


‘లావరిస్‌’లోని ఓ పాటలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), ‘జానే మన్‌’లో సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan), ‘డూప్లికేట్‌’లో షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan), ‘బాజి’లోని ఓ పాటలో ఆమిర్‌ఖాన్‌ (Aamir Khan), ‘హమ్‌షకల్స్‌’లో సైఫ్‌ అలీఖాన్‌ (Saif Ali Khan), ‘ఖిలాడి’లో అక్షయ్‌ కుమార్‌ (Akshay Kumar), ‘అప్నా సప్నా మనీ మనీ’లో రితేశ్‌ దేశ్‌ముఖ్‌ (Riteish Deshmukh), ‘ఆంటీ నంబరు 1’లో గోవింద మహిళగా సందడి చేశారు. ఇప్పుడు ఆయుష్మాన్‌ ఖురానా అలరించేందుకు సిద్ధమయ్యారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని