Dunki: ‘డంకీ’.. షారుక్‌ ఖాన్‌ కొత్త సినిమా విశేషాలివీ!

‘పఠాన్‌’, ‘జవాన్‌’తో ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ ఇప్పుడు ‘డంకీ’తో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. డిసెంబరు 21 సినిమా విడుదలకానున్న సందర్భంగా కొన్ని విశేషాలు..

Published : 19 Dec 2023 09:47 IST

షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) హీరోగా రూపొందిన కామెడీ- డ్రామా మూవీ ‘డంకీ’ (Dunki). డిసెంబరు 21న (Dunki Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు చూద్దాం (facts about dunki movie)..

  • సినిమాల వసూళ్ల పరంగా షారుక్‌ ఖాన్‌ ఈ ఏడాది సరికొత్త రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఒకే ఏడాదిలో రెండు సినిమాల (పఠాన్‌, జవాన్‌)తో రూ. 1000 కోట్లకుపైగా (వేర్వేరుగా) వసూళ్లు సాధించిన హీరోగా నిలిచారాయన. అంత పెద్ద విజయాలు అందుకున్నా షారుక్‌కు సంతృప్తి లేదట. అభిమానుల కోసమో, మరొకరి కోసమో కాకుండా తన కోసం తాను నటించిన సినిమా ‘డంకీ’ అని షారుక్‌ తెలిపారు. దీన్ని బట్టి ఆ కథ ఆయన మనసుకు ఎంత దగ్గరైందో అర్థం చేసుకోవచ్చు. పఠాన్‌, జవాన్‌లో యాక్షన్‌తో సందడి చేసిన ఆయన ‘డంకీ’తో నవ్వులు పంచుతూ.. భావోద్వేగానికి గురిచేయనున్నారు.
  • దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ (Rajkumar Hirani)- షారుక్‌ కాంబినేషన్‌లో రూపొందిన తొలి సినిమా ఇది. సామాజికాంశాలే రాజ్‌కుమార్‌ సినిమా ఇతివృత్తాలు. దానికి కామెడీ టచ్‌ ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’, ‘లగే రహో మున్నాభాయ్‌’, ‘త్రీ ఇడియట్స్‌’, ‘పీకే’, ‘సంజు’.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలన్నీ సూపర్‌ హిట్టే. అటు.. రెండు బ్లాక్‌బ్లస్టర్ల తర్వాత షారుక్‌ నటించిన చిత్రంకావడం, ఇటు.. పరాజయం ఎరగని హిరాణీ డైరెక్ట్‌ చేసిన సినిమాకావడం, తొలిసారి ఈ ఇద్దరూ కలిసి పనిచేయడం.. ఇలా పలు కోణాల్లో ‘డంకీ’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
  • షారుక్‌- హీరోయిన్‌ తాప్సి (Taapsee Pannu) కలిసి నటించిన ఫస్ట్‌ మూవీ ఇదే. హీరో విక్కీ కౌశల్‌ (Vicky Kaushal) అతిథి పాత్ర పోషించడం విశేషం.
  • దాదాపు 9 ఏళ్ల విరామం అనంతరం సీనియర్‌ నటుడు సతీశ్‌ షా నటించిన చిత్రమిదే. ఆయన ఆఖరి చిత్రం ‘హమ్‌షకల్స్‌’. బొమాన్‌ ఇరానీ ‘డంకీ’లో మరో కీలక పాత్రధారి.
  • 75 రోజుల్లో చిత్రీకరణ పూర్తయింది. వాటిలో షారుక్‌ ఖాన్‌ 60 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రీ ప్రొడక్షన్‌ దశ నుంచి విడుదల వరకు ఈ సినిమాకి దాదాపు రెండున్నరేళ్ల సమయం పట్టింది.
  • ముంబయి, జైపుర్‌, కశ్మీర్‌, బుడాపెస్ట్‌, లండన్‌, జెద్దా తదితర ప్రాంతాల్లో ఈ సినిమాని చిత్రీకరించారు.

  • ముందుగా ఈ సినిమాకి ‘రిటర్న్‌ టికెట్‌’, ‘టాస్‌’.. వీటిలో ఏదో ఒకటి పెట్టాలని దర్శకుడు అనుకున్నారు. కానీ, చివరకు ‘డంకీ’ని ఖరారు చేశారు. దీన్ని చాలామంది ‘డాంకీ’ అని అనేవారని షారుక్‌ ఓ సందర్భంలో నవ్వులు పూయించారు.
  • ఈ సినిమా ప్రొడక్షన్‌ కాస్ట్‌ రూ. 85 కోట్లు (నటులు, టెక్నీషియన్ల పారితోషికం కాకుండా). గత ఆరేళ్లలో షారుక్‌ నటించిన వాటిలో అతి తక్కువ బడ్జెట్‌తో రూపొందింది ఇదే. ఆర్టిస్ట్‌ల రెమ్యునరేషన్‌, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్‌ రూ. 120 కోట్లు.
  • యు/ఏ సెన్సార్‌ సర్టిఫికెట్‌ పొందిన ఈ సినిమా నిడివి 2:41 గంటలు. ముందుగా ఈ సినిమాని డిసెంబరు 22న విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. అదే రోజు ప్రభాస్‌ ‘సలార్‌’ రానుండడంతో ‘డంకీ’ రిలీజ్‌ ప్రీపోన్‌ అయింది.
  • దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడాన్ని డాంకీ ట్రావెల్‌ అంటారు. పంజాబీ వాళ్లు దానిని ‘డంకీ’ (Dunki Meaning) అని పిలుస్తుంటారు. అలా.. భారత్‌ నుంచి ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించే స్నేహితుల చుట్టూ తిరిగే కథ ఇది. మరి, వాళ్లు ఎదుర్కొన్న సవాళ్లేంటి?అసలు ఎందుకు వారు అక్రమంగా వెళ్లాలనుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్స్‌ ఓపెన్‌కాగా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. డిసెంబరు 21కి సంబంధించి రూ. 5 కోట్ల వ్యాపారం (డిసెంబరు 18 సాయంత్రం వరకు) జరిగిందని సమాచారం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని