oscars 2023: ఆస్కార్‌ సంబరం.. ఆసక్తికర విశేషాలు..

ఆస్కార్‌ వేడుక నిర్వహణకు రూ.463 కోట్లుపైనే ఖర్చు చేశారు. ఈసారి అతిథులకు ఎర్రతివాచీపై కాకుండా షాంపైన్‌ రంగు తివాచీపై ఆహ్వానం పలికారు.

Updated : 14 Mar 2023 06:42 IST

ఆస్కార్‌ ఖర్చు రూ.463 కోట్లు?

ఆస్కార్‌ వేడుక నిర్వహణకు రూ.463 కోట్లుపైనే ఖర్చు చేశారు. ఈసారి అతిథులకు ఎర్రతివాచీపై కాకుండా షాంపైన్‌ రంగు తివాచీపై ఆహ్వానం పలికారు. యాభై వేల చదరపు అడుగుల ఈ కార్పెట్‌ ఖరీదు రూ.20లక్షల పైనే. ఈ కార్యక్రమంలో ఒక వాణిజ్య ప్రకటన ప్రసారం చేయడానికి నిర్వాహకులు ఒక్కో 30 సెకన్ల యాడ్‌ కోసం రూ.16 కోట్ల ధర నిర్ణయించారు.

ఆస్కార్‌ ఏనుగులు మిస్సింగ్‌

ఆస్కార్‌ అవార్డు గెలిచిన డాక్యుమెంటరీ షార్ట్‌ఫిల్మ్‌ ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’లో రఘు, అమ్ము అనే రెండు  ఏనుగులు నటించాయి. అయితే దురదృష్టవశాత్తు ఆ ఏనుగులు ఆదివారం తప్పిపోయాయని సంరక్షకుడు బొమ్మన్‌  తెలిపారు. ‘కొంతమంది తాగుబోతులను ఆ రెండు ఏనుగులు తమిళనాడులోని కృష్ణగిరి అరణ్యంలోకి తరుముకొని వెళ్తూ.. అదృశ్యం అయ్యాయి. వాటి జాడ తెలియడం లేదు’ అన్నారు బొమ్మన్‌.


* అడవిలో ఉండాల్సిన ఎలుగుబంటి అకస్మాత్తుగా ఆస్కార్‌ అవార్డుల కార్యక్రమంలో ప్రత్యక్షమైంది. ఈ ఎలుగుబంటి వేషధారి తన చేష్టలతో అతిథుల్ని నవ్విస్తే.. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసుఫ్‌జాయ్‌ మాత్రం బాగా జడుసుకుంది. వ్యాఖ్యాత జిమ్మ కిమ్మెల్‌ మలాలాని హాలీవుడ్‌లో ఇద్దరు నటుల గొడవకు సంబంధించిన ఒక ప్రశ్న అడిగారు. ‘నేను శాంతి గురించే మాట్లాడతా’ అని ఆమె సూటిగానే సమాధానం చెప్పేసింది. ఇంతలోనే ఆ ఎలుగు మలాలాని తాకడం, నెట్టడం చేయసాగింది. కిమ్మెల్‌ కల్పించుకొని ‘ఓయ్‌.. ‘కొకైన్‌ బేర్‌’ మలాలాని ఒంటరిగా వదిలెయ్‌’ అనడంతో ఆ ఎలుగు అక్కడ్నుంచి వెళ్లిపోయింది.


* ‘ఈమె జెన్నీ.. ‘బన్షీర్‌ ఆఫ్‌ ఇనిషెరిన్‌’ చిత్రంలో నటించిన ఒక స్టార్‌’ అని వ్యాఖ్యాత జిమ్మీ కిమ్మెల్‌ వేదికపైకి వచ్చిన ఒకర్ని చూపిస్తూ చెప్పగానే.. డాల్బీ థియేటర్‌ నవ్వులతో మార్మోగిపోయింది. ఇంతకీ ఆ జెన్నీ ఈ చిత్రంలో నటించిన గాడిద.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని