Ponniyin Selvan 2: ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’కు వెళ్తున్నారా? ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Ponniyin Selvan 2: విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, కార్తి, త్రిష, జయం రవి కీలక పాత్రల్లో నటించిన హిస్టారికల్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. ఈ సినిమా రెండో భాగం ఏప్రిల్‌ 28న విడుదల కాబోతోంది.

Published : 27 Apr 2023 02:12 IST

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్‌ హిస్టారికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి భాగం గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ‘పార్ట్‌-2’ (ponniyin selvan 2) ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు మీకోసం..

  • 1985లో అలనాటి నటుడు ఎంజీ రామచంద్రన్‌ ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ను సినిమా తీయాలని కథకు సంబంధించిన హక్కులను కొనుగోలు చేశారు. షూటింగ్‌ మొదలు పెడదామనుకునే సమయంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. కథా హక్కులను నాలుగేళ్ల తర్వాత రెన్యువల్‌ చేయకపోవడంతో అది కాస్తా పట్టాలెక్కలేదు.
  • అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌ కూడా ‘పొన్నియిన్‌ సెల్వన్‌’పై మనసు పారేసుకున్నారు. మణిరత్నంతో కలిసి ఆయన ఈ సినిమా తీయాలని అనుకున్నారు. సినిమాకు సంబంధించి కొంత వర్క్‌ కూడా చేశారు. అయితే, బడ్జెట్‌ సమస్యల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు.
  • ఎట్టకేలకు 2019లో మణిరత్నం కలల ప్రాజెక్ట్‌ పట్టాలెక్కింది. లైకా ప్రొడక్షన్స్‌ ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు రావడంతో సినిమాను ప్రారంభించారు. మొత్తం రూ.500కోట్ల బడ్జెట్‌ను ఇందుకోసం లైకా ప్రొడక్షన్స్‌ ఖర్చు చేసినట్లు కోలీవుడ్‌లో టాక్‌. కథను పూర్తిగా సిద్ధం చేసిన తర్వాత దీన్ని రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించారు.
  • కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా తాజా చిత్రాన్ని మణిరత్నం తెరకెక్కిస్తున్నారు. భారతదేశ చరిత్రలో చోళ రాజ్య వైభవం దేదీప్యమానంగా వెలిగింది. అదే సమయంలో రాజ్యంలో అధికారం కోసం జరిగిన కుట్రలు, కుతంత్రాలు, ఎప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయిన ఆదిత్య కరికాలన్‌ హత్య ఇవన్నీ ఇందులో చర్చించారు.
  • ఈ సినిమాలోని కీలక పాత్రల కోసం పలువురు నటులను మణిరత్నం సంప్రదించారు. అందులో మహేశ్‌బాబు కూడా ఉన్నారట. అరుణ్‌మొళి వర్మన్‌, వల్లవరాయ వందియదేవన్‌ పాత్రలకు మహేశ్‌, విజయ్‌లను అనుకున్నారట. ఎందుకో ఈ కాంబినేషన్‌ సెట్‌ కాలేదు. ఈ పాత్రలను ప్రస్తుతం జయం రవి, కార్తి పోషిస్తున్నారు.
  • ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నందిని, మందాకిని అనే పాత్రల్లో ఆమె కనిపించారు. వృద్ధురాలి పాత్ర రెండో భాగంలో కీలకం కానుంది.
  • ఈ సినిమాకు సంగీతం మరో హైలైట్‌. ఆస్కార్‌ అవార్డు విజేత ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో మొత్తం 12 పాటలు ఉన్నాయి.
  • ఐమ్యాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న తొలి తమిళ చిత్రం ఇదే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని