Kartikeya: నేను చూసిన హీరోయిజం అదే!

‘‘కథానాయకుడి పాత్రకైనా, సినిమాకైనా సామాజిక బాధ్యత ఉండాల్సిందే అని బలంగా నమ్ముతా. అందుకు తగ్గ కథల్నే నేను ఎంచుకుంటున్నా’’ అన్నారు కార్తికేయ గుమ్మకొండ

Updated : 30 May 2024 08:31 IST

‘‘కథానాయకుడి పాత్రకైనా, సినిమాకైనా సామాజిక బాధ్యత ఉండాల్సిందే అని బలంగా నమ్ముతా. అందుకు తగ్గ కథల్నే నేను ఎంచుకుంటున్నా’’ అన్నారు కార్తికేయ గుమ్మకొండ. ఆయన కథానాయకుడిగా ‘భజే వాయు వేగం’ సినిమా రూపొందింది. యు.వి.కాన్సెప్ట్స్‌ పతాకంపై ప్రశాంత్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కార్తికేయ చెప్పిన కబుర్లు.. 

ఇందులో క్రికెటర్‌గా పాత్ర కోసం ఎలా సన్నద్ధమయ్యారు?

నేను గల్లీ క్రికెట్‌ ఆడటమే తప్ప, మైదానానికి వెళ్లి సీరియస్‌గా ఎప్పుడూ ఆడలేదు. అందుకే ఈ సినిమాలో క్రికెటర్‌ పాత్రలో కనిపించాలనగానే శిక్షణ తీసుకున్నా. 

ఈ కథలో నచ్చిన అంశం ఏమిటి? 

తెరపై కనిపించే హీరో మనలో ఒకడు అన్నట్టుగానే కనిపించాలి. తను ఎదుర్కొనే సమస్యలు అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉండాలి. అలాంటి హీరోయిజమే ఇందులో ఉంటుంది తప్ప, సూపర్‌మేన్‌ అన్నట్టుగా కనిపించడు. హీరోయిజం, యాక్షన్, భావోద్వేగాలు, ప్రేమ... ఇలా అన్నీ కుదిరిన కథ ఇది. కెరీర్‌ కోసం లేదంటే తండ్రి కోసం, నచ్చిన అమ్మాయి కోసం ఓ సాధారణ యువకుడు ఎంచుకున్న మార్గం ఏమిటనే విషయంపై హీరోయిజం ఆధారపడి వుంటుంది. అది ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటే హీరో అంతగా నచ్చుతాడు. అలాంటి హీరోయిజం ఇందులో కీలకం. ఇప్పుడున్న నా ఇమేజ్‌కి సరైన సినిమా ఇది. 

ఈ సినిమా కోసం చేసిన ప్రయాణం..? 

కరోనా సమయంలోనే ఈ కథ విన్నా. ‘బెదురులంక’ చేస్తున్నప్పుడే ఈ సినిమాని పట్టాలెక్కించాం. వేగంగా పూర్తి చేయాలనుకున్నాం. కానీ కొన్నాళ్లు చిత్రీకరణ చేశాక... ఇంత బాగా వస్తుంది కదా, కొంచెం సమయం తీసుకుని ఇంకా బాగా చేద్దామనుకున్నా. ‘బెదురులంక’ తర్వాత పూర్తిగా ఈ సినిమాపై దృష్టిపెట్టా. దర్శకుడు ఈ కథ చెప్పాక నాకు, కార్తీ ‘ఖైదీ’ సినిమా గుర్తొచ్చింది. అంత యాక్షన్‌ ఇందులో ఉండదు కానీ, అంతకంటే ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి.  

పేరున్న నిర్మాణ సంస్థల్లో సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?

నిర్మాణం, విడుదల అన్నీ పక్కాగా ఉంటాయనే నమ్మకం ఉంటుంది. యు.వి.కాన్సెప్ట్స్‌లో సినిమా అనగానే నాకొక పెద్ద సంస్థ దొరికిందని సంతోషించా. వీళ్ల నిర్మాణం కూడా చాలా క్లాస్‌గా ఉంటుంది. కథ కోసం ఏం చేయడానికైనా వెనకాడకుండా ‘భజే వాయు వేగం’ పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది యు.వి.కాన్సెప్ట్స్‌ సంస్థ. 

నేను కామెడీ చేశానా? యాక్షన్‌ చేశానా? అనేది కాదు... సినిమా ఎంత బాగుందనేదే కీలకం.  స్క్రీన్‌ప్లే, మేకింగ్‌ తదితర విషయాలు సినిమాలపై ప్రభావం చూపిస్తాయి. కామెడీనా, యాక్షనా అనే విషయాల కంటే కూడా, కథలు, పాత్రల ఎంపికలో నాకంటూ కొన్ని నియమాలు ఉంటాయి. తెరపై కనిపించే కథానాయకుడిని చూస్తే అలా మనం ఉండాలనిపించేలా స్ఫూర్తిని పంచాలి. అదే నేను చూసిన హీరోయిజం, అదే నేను కావాలనుకున్న హీరోని’’. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు