Telugu Movies: ఐపీఎల్‌, ఎన్నికల ఎఫెక్ట్‌.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి.

Published : 17 Apr 2024 12:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకవైపు ఐపీఎల్‌, మరోవైపు ఎన్నికలు వెరసి సినిమాలపై ప్రభావం చూపుతున్నాయి. సాధారణంగా వేసవిలో అగ్ర కథానాయకుల సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తాయి. ఏటా ఐపీఎల్‌ ఉన్నా సినిమాల విడుదలపై పెద్దగా ప్రభావం ఉండేది కాదు. ఈ ఏడాది ఐపీఎల్‌కు తోడు ఎలక్షన్స్‌ జరుగుతుండటంతో మొత్తం పరిస్థితి తారుమారైంది. గత మూడు వారాలుగా అన్నీ చిన్న చిత్రాలే వస్తున్నాయి. అనేక కారణాల వల్ల వేసవికి రావాల్సిన అగ్ర కథానాయకుల సినిమాలు మే చివరి నాటికి, మరికొన్ని జూన్‌కు వెళ్లగా, ఒకట్రెండు పెద్ద సినిమాలైతే ఈ ఏడాది ద్వితీయార్ధంలో బెర్తులు ఖరారు చేసుకున్నాయి. ఏపీ, తెలంగాణలో జరిగే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా ఈ నెలలో విడుదల కానుంది. దీంతో రాజకీయంగా మరింత వేడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తామన్న చిత్రాలు కూడా ఇప్పుడు వెనక్కి తగ్గుతున్నాయి.

ఆశిష్‌ కథానాయకుడిగా అరుణ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్‌ మి’. బేబీ ఫేమ్‌ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుండటం, దిల్‌రాజు నిర్మిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడింది. ఏప్రిల్‌ 25న ఈ మూవీ విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ఇప్పుడు సినిమా విడుదల వాయిదా వేసే అవకాశాన్ని చిత్ర బృందం పరిశీలిస్తోంది.

నవదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్న మరో రొమాంటిక్‌ డ్రామా ‘లవ్‌ మౌళి’. ఏప్రిల్‌ 19న విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ మూవీ విడుదల కూడా వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీ చెబుతామని నవదీప్‌ తెలిపారు. రక్షిత్‌ అట్లూరి, కోమలి ప్రసాద్‌ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శశివదనే’. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఏప్రిల్‌ 19న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పటివరకూ ట్రైలర్‌ కూడా రాలేదు. ప్రచార కార్యక్రమాలు కూడా ఇంకా మొదలు పెట్టలేదు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా వేయనున్నారని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని