Vikram: ఆ హిట్‌ సినిమా సీక్వెల్‌కు విక్రమ్‌ ప్లాన్‌?

ప్రముఖ హీరో విక్రమ్‌ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ సినీ అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించింది. అదేంటంటే? 

Published : 11 Feb 2024 17:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రయోగాత్మక పాత్రల్లో నటించేందుకు ఎప్పుడూ ముందుంటారు హీరో విక్రమ్‌ (Vikram). సోషల్‌ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌తో ఇప్పుడు వార్తల్లో నిలిచారు. తాను నటించిన ‘మహాన్‌’ (Mahaan) సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రెండు స్టిల్స్‌ షేర్‌ చేస్తూ ‘మహాన్‌ 2’ (Mahaan 2) అని క్యాప్షన్‌ పెట్టడం సినీ అభిమానుల్లో చర్చకు దారి తీసింది. ‘విక్రమ్‌.. మహాన్‌ 2’ను ప్లాన్‌ చేస్తున్నారా?’, ‘మేం వెయింటింగ్‌.. ఈ సారి థియేటర్లలో విడుదల చేయండి’ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. మరి, విక్రమ్‌ తన అభిమానుల్ని ఊరించేందుకు ఆ వ్యాఖ్యను జోడించారా? నిజంగానే సీక్వెల్‌ చేస్తున్నారా? తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మహాన్‌’ 2022 ఫిబ్రవరి 10న నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Mahaan on Amazon Prime Video)లో విడుదలైంది. చాలాకాలం తర్వాత విక్రమ్‌ ఈ సినిమాతో విజయం అందుకున్నారు. ఆయన కొడుకు ధ్రువ్‌, సిమ్రన్‌, బాబా సింహా, వాణీ భోజన్‌ కీలక పాత్రలు పోషించి మెప్పించారు. తండ్రి, కొడుకుల సంఘర్షణ ప్రధానంగా దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజ్‌ తెరకెక్కించారు. కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌ ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది.

విక్రమ్‌ నటించిన తాజా చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan) ఏప్రిల్‌లో రిలీజ్ కానుంది. కర్ణాటకలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌ కార్మికుల జీవితాల ఆధారంగా దర్శకుడు పా. రంజిత్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. మాళవిక మోహనన్‌, పార్వతి తిరువత్తు కీలక పాత్రలు పోషించారు. ఇందులో విక్రమ్‌ గిరిజన తెగకి చెందిన నాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి పడిన కష్టం మరే సినిమాకీ పడలేదని, ఇదొక విభిన్న కథ అని విక్రమ్‌ ఓ సందర్భంలో తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులకు మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని