Shah Rukh Khan- Yash: షారుక్‌ ఖాన్‌- యశ్‌.. కాంబో సెట్‌ చేస్తున్నారా?

షారుక్‌ ఖాన్‌, యశ్‌ కలిసి నటించే అవకాశాలున్నాయంటూ బాలీవుడ్‌లో వార్తలొచ్చాయి.

Published : 30 Jan 2024 22:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ‘కేజీయఫ్‌’ సిరీస్‌ చిత్రాలతో విశేష గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటుడు యష్‌ (Yash). నితీశ్‌ తివారీ రూపొందించనున్న భారీ ప్రాజెక్టు ‘రామాయణ్‌’తో ఆయన బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగింది. దానిపై స్పష్టత రాకముందే మరో గాసిప్‌ చక్కర్లు కొడుతోంది. ప్రముఖ హీరో షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan)కు చెందిన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌.. యశ్‌ను సంప్రదించిందని, ఓ సినిమా విషయమై చర్చలు జరిగాయని టాక్‌ వినిపిస్తోంది. అందులో షారుక్‌ కూడా నటించే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి.

‘‘యశ్‌, షారుక్‌ కలిసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారు. వీరిద్దరూ నటిస్తున్నారంటే సినీ అభిమానుల్లో భారీ అంచనాలే ఉంటాయి. వారిని నిరాశపరచకుండా మంచి కథను ఎంపిక చేసుకోవాలనుకుంటున్నారు. సరైన కథ కుదిరితే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి’’ అని ఆ ప్రొడక్షన్‌ హౌజ్‌ సన్నిహిత వర్గాలు తమకు చెప్పినట్లు ఓ మీడియా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం.. యశ్‌ ‘టాక్సిక్‌’ (Toxic)లో నటిస్తున్నారు. గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో యశ్‌ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని సమాచారం. 2025 ఏప్రిల్‌ 10న ఈ సినిమాని విడుదల చేయనున్నారు. 

‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’ చిత్రాలతో గతేడాది సందడి చేసిన షారుక్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమాల నుంచి విరామం తీసుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘కొన్నాళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్నా. కానీ, ఇటీవల కొంత గ్యాప్‌ ఇచ్చా. నేను తెరపై కనిపిస్తానో లేదోనని అభిమానులు సందేహించారు. ఇకపై నేను విరామం తీసుకోను’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని