Iswarya Menon: ముందు ‘భజే వాయు వేగం’.. తర్వాత ‘స్పై’: ఐశ్వర్య మేనన్‌

‘భజే వాయు వేగం’ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారు నటి ఐశ్వర్య మేనన్‌. ఈ సందర్భంగా ఆమె పంచుకున్న పలు విశేషాలివీ..

Published : 27 May 2024 22:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘స్పై’ (Spy)తో హీరోయిన్‌గా తెలుగు వారికి పరిచయమైన కోలీవుడ్‌ నటి ఐశ్వర్య మేనన్‌ (Iswarya Menon). త్వరలోనే ‘భజే వాయు వేగం’ (Bhaje Vaayu Vegam)తో మరోసారి ప్రేక్షకులను పలకరించనున్నారామె. కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా నూతన దర్శకుడు ప్రశాంత్‌ రెడ్డి తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ఐశ్వర్య పలు విశేషాలు పంచుకున్నారు. ఆ సంగతులు ఆమె మాటల్లోనే..

‘‘తమిళనాడులోని ఈరోడ్‌ నా స్వస్థలం. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. అన్నయ్య వైద్యుడు. నేను భరతనాట్యం డ్యాన్సర్‌ని. బాల్యం నుంచీ సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా ఉండేదాన్ని. కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌లోనూ నటించా. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక నటనపై దృష్టి పెట్టా. హీరోయిన్‌గా తెలుగులో నేను ఫస్ట్‌ సైన్‌ చేసిన ప్రాజెక్టు ‘భజే వాయు వేగం’. కానీ, రెండో సినిమా ‘స్పై’ ముందుగా విడుదలైంది. రెండింటిలోనూ విభిన్న పాత్రలు పోషించా. ప్రతి చిత్రాన్నీ ఇష్టపడే చేస్తాం. అన్నీ విజయాలు అందుకోవాలనే కోరుకుంటాం. కానీ, ఫలితం మన చేతుల్లో ఉండదు. అది ప్రేక్షకులు ఇవ్వాల్సిందే’’

‘‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాలోని కార్తికేయ నటన నన్ను ఆకట్టుకుంది. ఆయనతో కలిసి నటించాలనే కోరిక ‘భజే వాయు వేగం’తో నెరవేరింది. తెలుగులో మరో చిత్రాన్ని ఖరారు చేశా. త్వరలో అధికారిక ప్రకటన వస్తుంది. మరో రెండు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నా. మలయాళంలో మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘బజూక’లో కీలక పాత్ర పోషించా’’ అని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని