Rajinikanth: ఎన్నికల సమయం.. ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోంది: రజనీకాంత్‌

ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో రజనీకాంత్‌ సరదాగా మాట్లాడిన మాటలు వైరలవుతున్నాయి.

Published : 21 Mar 2024 00:09 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఎన్నికల సమయంలో తనకు ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోందని స్టార్‌ హీరో రజనీకాంత్ సరదాగా అన్నారు. చెన్నైలోని ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లిన ఆయన ఎంతోమందికి శస్త్రచికిత్స చేసి ప్రాణాలు నిలుపుతోన్న డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ‘గతంలో కావేరీ ఆసుపత్రి ఎక్కడ అని ఎవరినైనా అడిగితే.. కమల్‌హాసన్‌ వాళ్ల ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లు. ఇప్పుడు కమల్‌ హాసన్ వాళ్ల ఇల్లు కావేరి ఆసుపత్రి దగ్గర అని చెబుతున్నారు. ఇది సాధారణంగా చెబుతున్నానంతే.. మళ్లీ నాకు, కమల్‌కు మధ్య విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్లు ఉంటే మాట్లాడాలంటే సంకోచిస్తున్నాను. ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అసలే ఎన్నికల సమయం.. నేను ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను’’ అని సరదాగా చెప్పారు. గతంలో తాను అనేక ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నట్లు చెప్పిన రజనీ.. ఎంతోమంది డాక్టర్ల వల్లే ఇప్పుడిలా హాయిగా ఉన్నట్లు తెలిపారు.

సినిమాల విషయానికొస్తే..  ప్రస్తుతం తలైవా వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో ‘వెట్టయాన్’ చేస్తున్నారు. తెలుగులో ‘వేటగాడు’ పేరుతో ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రస్తుతం దీని షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మార్చి చివరికి ఈ మూవీ చిత్రీకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని