ఫ్రెంచ్‌ దర్శకురాలి చిత్రంలో జాకీ ష్రాఫ్‌

ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌.. ఇప్పుడు ఓ సరికొత్త సినిమా కోసం అంతర్జాతీయ దర్శకురాలితో చేతులు కలిపారు. నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రిన్‌ బొన్నైర్‌ తెరకెక్కిస్తున్న ‘స్లో జో’ అనే చిత్రంలో జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Published : 18 May 2024 00:20 IST

ఎన్నో విజయవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు జాకీ ష్రాఫ్‌.. ఇప్పుడు ఓ సరికొత్త సినిమా కోసం అంతర్జాతీయ దర్శకురాలితో చేతులు కలిపారు. నటిగా, దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రిన్‌ బొన్నైర్‌ తెరకెక్కిస్తున్న ‘స్లో జో’ అనే చిత్రంలో జాకీ ష్రాఫ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్లో జో అని పిలుచుకునే దివంగత భారతీయ సంగీత దర్శకుడు జోసెఫ్‌ మాన్యుయెల్‌ డా రోచా జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా జాకీ మాట్లాడుతూ ‘‘ఇలాంటి ఓ గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించడం సంతోషంగా ఉంది. సినిమాల పట్ల అంకిత భావం, ప్రతిభ ఉన్న సాండ్రిన్‌ లాంటి దర్శకురాలితో కలిసి పని చేస్తున్నందుకు గౌరవంగా భావిస్తున్నాను. జోసెఫ్‌ మాన్యుయెల్‌ జీవిత ప్రయాణం గురించి సినిమా రూపంలో ప్రపంచానికి తెలియజేయడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.


మరో కొత్త కేసుతో ‘క్రిమినల్‌ జస్టిస్‌’

‘క్రిమినల్‌ జస్టిస్‌’.. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొంది.. సినీప్రియుల్ని విశేషంగా ఆకట్టుకున్న సిరీస్‌. ఇందులో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు పంకజ్‌ త్రిపాఠి.. న్యాయవాది పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పటికే మూడు సీజన్లతో ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్‌ తాజాగా నాలుగో సీజన్‌ను ప్రకటించింది. దీన్ని సమీర్‌ నాయర్‌ రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా పంకజ్‌ మాట్లాడుతూ.. ‘‘క్రిమినల్‌ జస్టిస్‌’లో నేను పోషించిన మాధవ్‌ మిశ్రా పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో మంచి స్థానాన్ని సంపాదించుకుంది. ఈ పాత్రలో నన్ను నేను ఊహించుకున్నాను. ఇందులో న్యాయాన్ని గెలిపించడానికి మాధవ్‌ ఓడిపోయిన ప్రతిసారీ ఆ ఓటమినీ నా వ్యక్తిగత నష్టంగా భావించాను. మాధవ్‌ మిశ్రా ఎలాంటి కేసునైనా పరిశోధించి విజయాన్ని సాధించగలడని నిరూపించడానికి మరో సీజన్‌తో మీ ముందుకు రాబోతున్నాము. మరో కొత్త కేసుతో వస్తోన్న ఈ సీజన్‌ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాన’ని చెప్పుకొచ్చారు. 


హిట్‌ లిస్ట్‌లో ఎవరు?

తమిళ దర్శకుడు విక్రమన్‌ తనయుడు విజయ్‌ కనిష్క కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హిట్‌ లిస్ట్‌’. సముద్రఖని శరత్‌కుమార్, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ ముఖ్య పాత్రలు పోషించారు. సూర్య కతిర్‌ కాకల్లార్, కె.కార్తికేయన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ప్రముఖ కథానాయకుడు సూర్య విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘టీజర్‌ చాలా బాగుంది. విజయ్‌ కనిష్కకీ, చిత్రబృందానికి మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘యాక్షన్, సస్పెన్స్‌ అంశాలతోపాటు... నేర నేపథ్యంతో కూడిన కథ ఇది. మా సినిమాలో హిట్‌ లిస్ట్‌లో ఉన్నదెవరనేది తెరపైనే చూడాలి. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందని చిత్రవర్గాలు చెప్పాయి. మునిష్కాంత్‌ కింగ్స్‌ లే, సితార, స్మృతి వెంకట్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఎస్‌.దేవరాజ్, సంగీతం: సి.సత్య, ఛాయాగ్రహణం: కె.రామ్‌చరణ్‌. 


నాని.. యావరేజ్‌ స్టూడెంట్‌

పవన్‌ కుమార్‌ కొత్తూరి కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘యావరేజ్‌ స్టూడెంట్‌ నాని’. స్నేహ మాలవ్య, సాహిబా భాసిన్, వివియా సంత్‌ కథానాయికలు.  ఝాన్సీ, రాజీవ్‌ కనకాల, ఖలేజా గిరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పవన్‌కుమార్‌.కె, బిషాలి గోయెల్‌ నిర్మాతలు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు.  ‘‘యాక్షన్‌ ప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిది. కుటుంబ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాలు పుష్కలంగా ఉంటాయి. ‘మెరిసే మెరిసే’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన పవన్‌ కుమార్‌ కొత్తూరి ఈ సినిమాతో కథానాయకుడిగానూ మెప్పిస్తారు. యావరేజ్‌ స్టూడెంట్‌ అనిపించుకున్న ఓ కుర్రాడు ఏం చేశాడనేది ఈ కథలో కీలకం. సినిమాకి సంబంధించిన మిగిలిన వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తామ’’ని తెలిపారు నిర్మాతలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సజీష్‌ రాజేంద్రన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని