Jagapathi Babu: ఆ విజయాన్ని ఉపయోగించుకోనందుకు ఇప్పటికీ బాధపడుతున్నా: జగపతి బాబు

తాను నటించిన ఓ సినిమా విజయాన్ని ఉపయోగించుకోలేకపోయినట్లు నటుడు జగపతి బాబు తెలిపారు. లేదంటే తనకు ఇంకా అవార్డులు వచ్చేవన్నారు.

Published : 02 Apr 2024 13:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు హీరోగా అలరించిన జగపతి బాబు (Jagapathi Babu) ప్రస్తుతం విలన్‌గా ఆకట్టుకుంటున్నారు. అగ్ర కథానాయకుల సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలతో మెప్పిస్తున్నారు. ‘లెజెండ్‌’తో ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ హీరోగా రూపొందిన ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం అందుకోవడం జగపతి బాబు కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచింది. అయితే, ఈ సక్సెస్‌ను తాను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయినట్లు తాజాగా ఆయన తెలిపారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ‘లెజెండ్‌’ గురించి మాట్లాడారు. ‘‘ఆ సినిమాలో నన్ను విలన్‌గా తీసుకోవడం చర్చనీయాంశమైంది. జగపతి బాబు విలన్‌ ఏంటి? అని చాలామంది అన్నారు. విలన్‌ పాత్ర బలంగా ఉంటేనే సినిమా హిట్‌ అవుతుందని బాలకృష్ణ వారికి సమాధానం చెప్పారు. ఆయనతో నటించడం ఎప్పుడూ సౌకర్యంగానే ఉంటుంది. ఆ చిత్రం తర్వాతే నా పాత్రలను సీరియస్‌గా తీసుకోవడం మొదలుపెట్టా. అది నాకు మంచి ఉత్సాహాన్నిచ్చింది. కానీ, నేను దాని విజయాన్ని ఉపయోగించుకోలేకపోయా. ఇప్పటికీ ఈ విషయంలో బాధపడుతున్నా. ‘లెజెండ్‌’ తర్వాత నేను ఎన్నో పాత్రల్లో నటించాను. అందులో కొన్ని మాత్రమే చెప్పుకోదగ్గవి చేశాను. లెజెండ్‌లో చేసిన శక్తిమంతమైన పాత్రల వంటివే మరిన్ని చేసుంటే బాగుండేది’ అని అన్నారు.

‘సలార్‌’, ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జగపతి బాబు ప్రస్తుతం ‘పుష్ప2’లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ఈ చిత్రం రానుంది. దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 15న ఇది ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని