Jai Hanuman: హనుమాన్‌ జన్మోత్సవ్‌.. ప్రశాంత్‌వర్మ ప్లాన్‌ మామూలుగా లేదుగా!

హనుమాన్‌ జన్మోత్సవ్‌ సందర్భంగా ‘జై హనుమాన్‌’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు.

Published : 23 Apr 2024 15:28 IST

హైదరాబాద్‌: తేజ సజ్జ (Teja Sajja) కీలక పాత్రలో ప్రశాంత్‌వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో రూపొందిన సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘హను-మాన్‌’ (Hanu Man). ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ మూవీకి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు పూర్తవగా, త్వరలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. మంగళవారం హనుమాన్‌ జన్మోత్సవం సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘జై హనుమాన్‌’ మూవీని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో వచ్చే ప్రతీ సినిమానూ ఐమ్యాక్స్‌ 3డీ వెర్షన్‌లోనే తీసుకురానున్నట్లు తెలిపారు. నిప్పులు కక్కుతున్న డ్రాగన్‌ ఎదురుగా హనుమాన్‌ నిలబడి ఉన్న పోస్టర్‌ను పంచుకున్నారు. ఇప్పటివరకూ చైనా మూవీలకే పరిమితమైన డ్రాగన్‌ కాన్సెప్ట్‌ ఇప్పుడు ఇండియా సినిమాలోనూ అలరించనుంది.

మరోవైపు సీక్వెల్‌లో నటించే నటీనటుల ఎంపిక ప్రక్రియను కూడా ప్రశాంత్‌వర్మ వేగవంతం చేశారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న చిత్రం కావడంతో బాలీవుడ్‌కు చెందిన పలువురు నటీనటుల పేర్లను పరిశీలిస్తున్నారు. ‘హను-మాన్‌’ పూర్తిగా బడ్జెట్‌ పరిమితుల మధ్య తీసినా క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఇంత తక్కువ బడ్జెట్‌ అద్భుతమైన అవుట్‌పుట్‌ ఇచ్చారంటూ విమర్శకులు సైతం టీమ్‌ను మెచ్చుకున్నారు. రాబోయే ‘జై హనుమాన్‌’కు ఆ ఇబ్బంది లేదు. దీంతో తొలి భాగాన్ని మించి ఉండేలా సినిమా తీయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అదే సమయంలో భారతీయ ప్రేక్షకులకు చక్కటి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులోభాగంగానే ఐమ్యాక్స్‌ 3డీ వెర్షన్‌ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు. తాజా ప్రకటనతో సీక్వెల్‌పై మరిన్ని అంచనాలు పెరిగాయి.

100 రోజులు పూర్తి చేసుకున్న హనుమాన్‌

సంక్రాంతికి వచ్చిన ‘హను-మాన్‌’ తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది. ‘గుంటూరు కారం’, ‘సైంధవ్’, ‘నా సామిరంగ’ వంటి అగ్ర కథానాయకుల చిత్రాలతో పోటీపడి విజేతగా నిలిచింది. బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ.300 కోట్లు వసూలు చేసింది.  25 సెంటర్లలో ఈ మూవీ 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. ఇటీవల కాలంలో ఈ అరుదైన రికార్డు సాధించిన చిత్రం ‘హనుమాన్‌’ అంటూ చిత్ర బృందం పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని