Jai Hanuman: ‘హనుమాన్‌’ క్లైమాక్స్‌కు మించి ‘జై హనుమాన్’ ఉంటుంది: ప్రశాంత్‌ వర్మ

Hanuman: హనుమాన్‌ 50 రోజుల సక్సెస్‌ మీట్‌లో దర్శకుడు ప్రశాంత్‌ వర్మ మాట్లాడారు.

Updated : 02 Mar 2024 15:07 IST

హైదరాబాద్‌: త్వరలోనే ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) ఫస్ట్‌లుక్‌ విడుదల చేయబోతున్నట్లు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తెలిపారు. సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హనుమాన్‌’ (Hanuman) మూవీ 150 థియేటర్‌లలో 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందం ‘హిస్టారికల్‌ 50 డేస్‌’ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

‘‘చిత్ర పరిశ్రమలో ఓ సినిమాకు సంబంధించి 50 రోజుల కార్యక్రమం జరిగి చాలా రోజులైంది. ఇన్నేళ్ల తర్వాత ‘హనుమాన్‌’కు జరగడం సంతోషంగా ఉంది. ఒక సినిమా విజయం చాలా మంది జీవితాలను మారుస్తుంది. ‘హనుమాన్‌’ మా మొత్తం టీమ్‌కు పేరు తెచ్చింది. ఒకప్పుడు ఇలాంటి కార్యక్రమాలను సినిమా ప్రమోషన్స్‌ కోసం చేసేవాళ్లు. తమ మూవీ వారం రోజులు ఆడి, పెట్టిన డబ్బులు వస్తే చాలులే అనుకుంటున్న ఈ రోజుల్లో 50 రోజుల ఫంక్షన్‌ చేయడం చాలా మంది నిర్మాతల్లో నమ్మకాన్ని తీసుకొస్తుంది. ఎంతో మంది స్ఫూర్తి పొందుతారు. నా మొదటి సినిమా ‘అ!’ మంచి విజయాన్ని అందుకుని, విమర్శకులను సైతం మెప్పించింది. ఆ సమయంలో ఇలాంటి వేడుక చేయలేకపోయాం. ఆ మూవీ కమర్షియల్‌గా హిట్‌ కాలేదని చాలా మంది అనుకున్నారు. ‘హనుమాన్’ రీమాస్టర్‌ వెర్షన్‌ తీసుకొస్తున్నాం. అది ఇంకా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. ప్రశాంత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌కి ఈ మూవీ మంచి పునాది వేసింది. మీరిచ్చిన ప్రోత్సాహంతో క్వాలిటీ సినిమాలు చేస్తాం. సినిమా విడుదలైన దగ్గరి నుంచి మేము అస్సలు పార్టీ చేసుకోలేదు. అంతర్జాతీయంగానూ ఈ మూవీని ఎలా తీసుకువెళ్లాలా? అని ప్రయత్నాలు చేశాం. స్పెయిన్‌, జపాన్‌, చైనా డిస్ట్రిబ్యూటర్స్‌తో మాట్లాడాం. వాళ్లకూ ఈ మూవీ నచ్చింది. త్వరలోనే విడుదల చేస్తున్నాం. ప్రపంచదేశాల్లో తెలుగు మూవీ గొప్పతనాన్ని ‘హనుమాన్‌’ చాటబోతోంది’’

‘‘జై హనుమాన్‌’కు సంబంధించిన పని మొదలైంది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేస్తాం. ఇందులో హనుమంతుడే హీరో. ‘హనుమాన్‌’ క్లైమాక్స్‌ ఏవిధంగానైతే విపరీతంగా నచ్చిందో కొత్త మూవీ రెండున్నర గంటల పాటు అదే థ్రిల్‌, జోష్‌తో ఉంటుంది. కచ్చితంగా మీరు గర్వపడేలా సినిమా తీస్తా. మీరు అందించిన విజయాన్ని బాధ్యతగా తీసుకుని, ‘జై హనుమాన్‌’ తీర్చిదిద్దుతా’’ అని ప్రశాంత్‌ వర్మ అన్నారు. తేజ సజ్జా, అమృత అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ‘హనుమాన్‌’ ఇప్పటివరకూ రూ.330 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఓటీటీలో (Hanuman ott relase) విడుదలకు సిద్ధమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు