Janhvi Kapoor: హాట్‌ టాపిక్‌గా జాన్వీ కపూర్‌ నెక్లెస్‌.. ఆ పేరే కారణం!

హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ ధరించిన నెక్లెస్‌ హాట్‌ టాపిక్‌గా మారింది.

Published : 11 Apr 2024 00:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి జాన్వీ కపూర్‌ (Janhvi Kapoor) ధరించిన గొలుసు ప్రస్తుతం ‘టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌’గా మారింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో #Janhvikapoor హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌లో నిలిచింది. కారణమేంటంటే? తన తండ్రి నిర్మించిన ‘మైదాన్‌’ సినిమా ప్రీమియర్‌ షోకు జాన్వీతోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలుపు రంగు దుస్తుల్లో జాన్వీ మెరిశారు. సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. సంబంధిత ఫొటోలు, వీడియోలు బయటకురాగా .. ఆమె ధరించిన నెక్లెస్‌పై పలువురు దృష్టి పెట్టారు. ఆ నెక్లెస్‌పై ‘శిఖు’ (శిఖర్‌ పహరియా) అనే లోగో ఉందని, అతడితో లవ్‌లో ఉన్నట్లు జాన్వీ పరోక్షంగా ఖరారు చేశారంటూ నెట్టింట పోస్ట్‌లు పెట్టారు. బాలీవుడ్‌ మీడియాలో సైతం సంబంధిత వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌ కుమార్‌ షిండే మనవడు శిఖర్‌తో జాన్వీ డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అతడి నిక్‌నేమ్‌తో కూడిన నెక్లెస్‌ను జాన్వీ ధరించడంతో ఆ వార్తలకు బలం చేకూరినట్లైంది. ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో.. ‘మీ స్పీడ్‌ డయిల్‌ లిస్ట్‌లో ఎవరి నంబర్లు ఉంటాయి?’ అని హోస్ట్‌ ప్రశ్నించగా తన తండ్రి, చెల్లి, శిఖర్‌ పేరు చెప్పారు జాన్వీ. ఫ్లోలో ఆ పేరు చెప్పడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ నాటి నుంచి రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి.

సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’తో జాన్వీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ ఉత్తరాదిలో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తూ జాన్వీ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు, #RC16 (వర్కింగ్‌ టైటిల్‌)లోనూ జాన్వీ హీరోయిన్‌గా ఎంపికయ్యారు. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అజయ్‌ దేవ్‌గణ్‌ ప్రధాన పాత్రలో దర్శకుడు అమిత్‌ శర్మ రూపొందించిన ‘మైదాన్‌’ బుధవారం విడుదలైంది. ఈ సినిమాని బోనీ కపూర్‌, అరుణవ జాయ్‌ సేన్‌గుప్త, ఆకాశ్‌ చావ్లా సంయుక్తంగా నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని