Janhvi Kapoor: 150 రోజుల ట్రైనింగ్‌.. 30 రోజుల షూటింగ్‌.. రెండుసార్లు గాయాలు

జాన్వీకపూర్‌ తాను నటిస్తున్న ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

Published : 26 May 2024 00:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా, అందులోని పాత్ర కోసం నటులు తమని తాము మార్చుకునే తీరు అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. శ్రీదేవి తనయగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది జాన్వీకపూర్‌ (Janhvi Kapoor). శరణ్‌ శర్మ దర్శకత్వంలో రాజ్‌కుమార్‌తో కలిసి ఆమె నటిస్తున్న రొమాంటిక్‌ స్పోర్ట్స్‌ డ్రామా ‘మిస్టర్‌ అండ్‌ మిస్సెస్‌ మహి’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో క్రికెటర్‌గా కనిపించేందుకు జాన్వీ కపూర్‌ ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. అది వారమో, పది రోజులో కాదు. ఏకంగా 150 రోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు జరిగినట్లు తాజాగా పంచుకున్న వీడియోలో తెలిపింది.

క్రికెట్‌కు సంబంధించిన సన్నివేశాలను 30రోజులకు పైగా చిత్రీకరించినట్లు పేర్కొంది.. క్రికెట్‌ సాధనలో భాగంగా రెండు సార్లు గాయపడిందట. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రం కోసం ‘మిలీ’ సినిమా షూటింగ్‌ సమయంలోనే శిక్షణ ప్రారంభించాను. నా కోచ్‌లు నన్ను పూర్తి క్రికెటర్‌గా మార్చారు. నిజానికి వీఎఫ్‌ఎక్స్‌తో దర్శకుడు అనుకున్న సన్నివేశాలను చిత్రీకరించొచ్చు. కానీ, ఆయన ప్రతీ సీన్‌ సహజంగా ఉండాలని కోరుకున్నారు. అందుకే అలా చేయలేదు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు ఎన్నో గాయాలయ్యాయి. రెండు భుజాలు పనిచెయ్యవేమో అనుకున్నా. నా ఇద్దరు కోచ్‌లు క్రికెట్‌ నేర్పడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ చిత్రం విడుదలయ్యాక నా పాత్రకు వచ్చే ప్రశంసలన్నీ వాళ్లకే దక్కుతాయి. ఎన్నోసార్లు ఈ సినిమా నుంచి వైదొలగాలని భావించా. వాళ్లు నాకు ధైర్యం చెప్పారు’ అని జాన్వీ వెల్లడించింది.

ఇంతకీ కథేంటంటే: మహేంద్ర (రాజ్‌కుమార్‌ రావ్‌) క్రికెటర్‌గా ఉన్నత స్థానాలకు ఎదగలేకపోతాడు. మహిమ (జాన్వీకపూర్‌) వైద్యురాలు. పెద్దలు కుదిర్చిన వివాహ బంధంతో ఒక్కటవుతారు. ఒకరి ఇష్టాలను మరొకరు తెలుసుకునే క్రమంలో ఇద్దరికీ క్రికెట్‌ అంటే ప్యాషన్‌ అని అర్థమవుతుంది. దీంతో తన భార్యలో ఉన్న టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు శిక్షణ ఇవ్వడం మొదలు పెడతాడు. మరి, ఆమె కలను సాకారం చేసే క్రమంలో మహికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా ఇద్దరూ ఎదుర్కొన్నారు. మహి క్రికెట్‌ జర్నీ ఎంత వరకూ వెళ్లింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని