Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే!

లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’(jigarthanda double x) ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది.

Published : 01 Dec 2023 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రాఘవ లారెన్స్‌, ఎస్‌.జె.సూర్య ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌’(jigarthanda double x). ‘జిగర్‌ తండ’కు సీక్వెల్‌గా తెరకెక్కించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడీ యాక్షన్‌ కామెడీ చిత్రం ఓటీటీలోనూ అలరించడానికి సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిసెంబర్‌ 8 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనుంది. త్వరలోనే ఇంగ్లిషులోనూ ప్రసారం చేయనున్నారు.

కథేంటంటే: కృపాకర్‌ (ఎస్‌.జె.సూర్య)కు పోలీస్‌ అవ్వాలన్నది కల. ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పోలీస్‌శాఖలో ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు. కానీ, అంతలోనే చేయని తప్పునకు ఓ హత్య కేసులో జైలు పాలవుతాడు. ఆ తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకొక మార్గం దొరుకుతుంది. కర్నూల్‌లోని జిగర్‌ తండ మర్డర్‌ క్లబ్‌ గ్యాంగ్‌స్టర్‌ సీజర్‌ (లారెన్స్‌)ను చంపే ఆపరేషన్‌ను అతనికి అప్పగిస్తారు. తను ఆ పని పూర్తి చేస్తే కేసు నుంచి బయట పడటమే కాకుండా ఎస్సై ఉద్యోగం కూడా తిరిగి పొందగలుగుతాడు. అందుకే ఆ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు తాను ఒప్పుకొంటాడు. సీజర్‌కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి.. దాన్ని అడ్డం పెట్టుకొని రే దాసన్‌ అనే దర్శకుడిగా అతడి దగ్గర చేరతాడు. తనతో పాన్‌ ఇండియా సినిమా తీస్తానని చెప్పి.. హత్యకు ప్రణాళిక రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రే దాసన్‌ ప్రణాళిక ఫలించిందా? పాన్‌ ఇండియా తొలి నల్ల హీరోగా పేరు తెచ్చుకోవాలనుకున్న సీజర్‌ కల నెరవేరిందా? వీళ్ల కథకూ... నల్లమల అడవుల్లో ఏనుగుల్ని చంపి.. దంతాలు తరలించే క్రూరమైన సెటానీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ మొత్తం వ్యవహారం వెనకున్న రాజకీయ కోణమేంటి? అన్నదే మిగతా కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని