Kalki: సరికొత్తగా ‘కల్కి’ ప్రమోషన్స్‌.. ఓటీటీతో మొదలుపెడతారా!

‘కల్కి’ ప్రమోషన్స్‌ను వినూత్న రీతిలో మొదలుపెట్టాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Published : 06 Apr 2024 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ల కాంబోలో రానున్న సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఈ సినిమా కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త ప్రభాస్‌ అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ను మూవీ యూనిట్‌ వినూత్న రీతిలో ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం దీని చిత్రీకరణ చివరిదశలో ఉంది. దీంతో ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టాలని చిత్రబృందం భావిస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ని ప్రతిష్ఠాత్మక ‘శాండియాగో కామిక్‌ కాన్‌’ వేడుకలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానికి విపరీతమైన ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పుడు ఈ సినిమాలోని పాత్రలను పరిచయం చేస్తూ ఓ యానిమేషన్‌ వీడియో చేయనున్నారట. దాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వీడియోను ఒకేరోజు విడుదల చేయనున్నారట. ఏప్రిల్‌ 9న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా దీన్ని ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే భారతీయ చిత్రాన్ని ఇలా ప్రమోట్‌ చేయడం ఇదే తొలిసారి అవుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన యానిమేషన్‌ పనులతో పాటు డబ్బింగ్‌ వర్క్‌ కూడా పూర్తయిందని టాక్‌. ఇటీవలే ప్రభాస్ (Prabhas) తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పారట.

మరోవైపు ఈ సినిమా విడుదల వాయిదా పడనుందన్న ప్రచారం జోరందుకుంది. మే 9న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో తెలిపింది. తాజాగా మే30కు వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి.  దీనిపై కల్కి టీమ్‌ స్పందించలేదు. త్వరలోనే విడుదల విషయంతో పాటు.. యానిమేషన్‌ వీడియోపైనా అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని