Kamal Haasan: హాలీవుడ్‌ దర్శకుడికి కమల్‌ హాసన్‌ ఆతిథ్యం.. సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా సిద్ధార్థ్‌- అదితి

హాలీవుడ్‌ డైరెక్టర్‌కు కమల్‌ హాసన్‌ ఆతిథ్యమిచ్చారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 15 Apr 2024 00:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మెక్సికన్‌ డైరెక్టర్‌ అల్ఫాన్సో కారోన్‌ (Alfonso Cuaron) ఇండియాకు విచ్చేశారు. పర్యటనలో భాగంగా ఆదివారం చెన్నై వెళ్లారు. ఈ క్రమంలో.. ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ఆయనకు ఆతిథ్యమిచ్చారు. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. అల్ఫాన్సో తనకు సోదరుడిలాంటివారని పేర్కొన్న కమల్‌.. సుదీర్ఘంగా సినిమా సంగతులు మాట్లాడుకున్నామని, ఆయనతో కలిసి భోజనం చేయడం సంతోషాన్నిచ్చిందని తెలిపారు. అల్ఫాన్సోకు బంగినపల్లి మామిడి పండ్ల రుచి చూపించానన్నారు. వారితోపాటు దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌, సినిమాటోగ్రాఫర్‌ రవి కె. చంద్రన్‌, హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ అదితిరావు హైదరి తదితరులున్నారు. ఈ ఫొటోలు నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లెజెండ్స్‌ మధ్య సిద్ధు (Siddharth)- అదితి (Aditi Rao Hydari) సెంట్రాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారంటూ నెటిజన్లు, సినీ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కొంతకాలంగా ప్రేమలో వీరు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే.

కమల్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు 2’ (Indian 2)లో సిద్ధార్థ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా జూన్‌లో విడుదల కానుంది. కమల్‌ ప్రధాన పాత్రలో మణిరత్నం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ రెండింటితోపాటు ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898AD)లోని కీలక పాత్రతో ప్రేక్షకులను అలరించనున్నారు కమల్‌. ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. త్వరలోనే రిలీజ్‌ కానుంది. అల్ఫాన్సో విషయానికొస్తే.. ఈయన తెరకెక్కించిన ‘గ్రావిటీ’ (2013), ‘రోమా’ (2018) సినిమాలకుగానూ ఉత్తమ దర్శకుడు సహా ఐదు ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని