Indian2: ‘భారతీయుడు 2’ వచ్చేది అప్పుడే.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

కమల్‌ హాసన్‌ హీరోగా తెరకెక్కిన ‘భారతీయుడు2’ విడుదలపై చిత్రబృందం అప్‌డేట్‌ ఇచ్చింది.

Published : 06 Apr 2024 19:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కథానాయకుడు కమల్‌హాసన్‌.. దర్శకుడు శంకర్‌ కాంబోలో రూపొందిన పాన్‌ ఇండియా చిత్రం ‘భారతీయుడు 2’ (Indian2). వీళ్ల కాంబినేషన్‌లోనే వచ్చిన హిట్‌ సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. తాజాగా దీని విడుదలపై టీమ్ అప్‌డేట్‌ ఇచ్చింది. ఈ చిత్రాన్ని జూన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుపుతూ ఓ పవర్‌ఫుల్‌ పోస్టర్‌ను పంచుకుంది. జూన్‌ 13న ఇది రానున్నట్లు తెలుస్తోంది. 2022లో కమల్‌ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’ కూడా జూన్‌లోనే విడుదలై సూపర్‌ హిట్‌ను అందుకుంది. మళ్లీ రెండేళ్ల తర్వాత అదే నెలలో కమల్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండడంతో అభిమానులంతా మరోసారి హిట్‌ పక్కా అని కామెంట్స్‌ చేస్తున్నారు.

1996లో శంకర్‌ దర్శకత్వంలో వచ్చి సంచలనం సృష్టించింది ‘భారతీయుడు’. సేనాపతి పాత్రలో కమల్‌ (kamal haasan) ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘భారతీయుడు 2’ మరోసారి మ్యాజిక్‌ చేసేందుకు సిద్ధమైంది. నిజానికి ఈ సీక్వెల్‌ను ప్రకటించిన చాలా సంవత్సరాలకు ఇది సెట్స్‌ పైకి వెళ్లింది. ఆ తర్వాత 2020లో సెట్లో ప్రమాదం జరగడం, కొవిడ్‌, దర్శక నిర్మాతల మధ్య తలెత్తిన సమస్యల కారణంగా షూటింగ్‌ కొంతకాలం నిలిచిపోయింది. గతేడాది దీని చిత్రీకరణను పునఃప్రారంభించిన శంకర్‌ బ్రేక్‌ లేకుండా దీన్ని పూర్తి చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధార్థ్‌, కాజల్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్‌, ఎస్‌జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని