Kangana Ranaut: వరుస ఫ్లాప్స్‌ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?

నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు.

Updated : 28 Mar 2024 13:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఓవైపు సినిమాల్లో నటిస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut). హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ అభ్యర్థిగా భాజపా తరఫున ఆమె పోటీ చేయనున్నారు. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై తాజాగా ఆమె స్పందించారు. సినిమాల పరంగా వరుసగా పరాజయాలు అందుకోవడం వల్లే ఆమె పాలిటిక్స్‌లోకి వచ్చారంటూ పలువురు చేస్తోన్న కామెంట్స్‌పై మాట్లాడుతూ అలాంటిది ఏమీ లేదని స్పష్టతనిచ్చారు.

‘‘ఫ్లాపులు లేకుండా కేవలం హిట్స్‌ మాత్రమే అందుకున్న నటీనటులెవరూ ఈ ప్రపంచంలో లేరు. దాదాపు పదేళ్లపాటు షారుక్‌ నటించిన ఏ చిత్రమూ సరైన విజయాన్ని అందుకోలేదు. గతేడాది విడుదలైన ‘పఠాన్‌’ సూపర్‌హిట్‌ అయ్యింది. అదేవిధంగా, కెరీర్‌ ఆరంభంలో నేను నటించిన ఏ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆడలేదు. దాదాపు ఎనిమిదేళ్లు ఫ్లాప్స్‌ చూశా. ఆ సమయంలో ‘క్వీన్‌’ విడుదలతో సక్సెస్‌ దక్కింది. ఆ తర్వాత వరుసగా కొన్ని విజయాలు చూశా. ‘మణికర్ణిక’ ముందు నాలుగేళ్లు నాకు ఎలాంటి హిట్స్‌ లేవు. ఇటీవల కూడా వరుస పరాజయాలు అందుకున్నా. త్వరలో ‘ఎమర్జెన్సీ’ రానుంది. అది విజయం అందుకోవచ్చనుకుంటున్నా. ఓటీటీ కారణంగా చాలామంది నటీనటులు తమ టాలెంట్ నిరూపించుకునేందుకు అవకాశం దొరికింది. కానీ, ఓటీటీ స్టార్స్‌ను క్రియేట్‌ చేయలేదు. నాకు తెలిసినంత వరకూ మేమే లాస్ట్‌ జనరేషన్‌ ఆఫ్‌ స్టార్స్‌’’ అని కంగన అన్నారు.

2019లో ‘మణికర్ణిక’తో చాలా ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకున్నారు కంగన. ఆ తర్వాత ఆమె వరుస చిత్రాల్లో యాక్ట్ చేశారు. ‘జడ్జిమెంటల్ హై క్యా’, ‘పంగా’, ‘తలైవి’, ‘ధకడ్‌’, ‘చంద్రముఖి 2’, ‘తేజస్‌’ వంటి చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ప్రస్తుతం ఆమె ‘ఎమర్జెన్సీ’ రిలీజ్‌ పనుల్లో బిజీగా ఉన్నారు. భారతదేశపు మొదటి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ రాజకీయ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. కంగన స్వీయ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. జూన్‌ 14న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని