Gurthunda Seethakalam: ఏ చిత్ర పరిశ్రమైనా ఒక్కటే!

ప్రతి భాషలోనూ అందంగా కనిపించేందుకు ఆస్కారమున్న పాత్రలే నన్ను ఎక్కువగా వరించాయి. ఇందులోనూ అలాంటిదే. సరైన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నా’’ అన్నారు కావ్యశెట్టి.

Updated : 30 Nov 2022 06:57 IST

‘‘ప్రతి భాషలోనూ అందంగా కనిపించేందుకు ఆస్కారమున్న పాత్రలే నన్ను ఎక్కువగా వరించాయి. ఇందులోనూ అలాంటిదే. సరైన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నా’’ అన్నారు కావ్యశెట్టి (Kavya Shetty). తెలుగు తెరపై సందడి చేయనున్న మరో కన్నడ భామ ఈమె. సత్యదేవ్‌ (Satya Dev) కథానాయకుడిగా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’లో (Gurthunda Seethakalam) ఓ కీలక పాత్ర పోషించింది. ఈ చిత్రం డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా కావ్యశెట్టి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...

‘‘కన్నడలో ‘లవ్‌ మాక్‌టైల్‌’కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. ఆ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సాధించింది. ఆలస్యమైనా ఓ మంచి సినిమాతో తెలుగులో పరిచయం అవుతున్నందుకు ఆనందంగా ఉంది’’.

*ఇందులో నేను పోషించిన పాత్ర పేరు... అమ్ము. మూడు దశల్లో సాగే ప్రేమకథ ఇది. నేను కళాశాల నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో సత్యదేవ్‌కి జోడీగా కనిపిస్తా. స్మార్ట్‌ ఫోన్లు కాకుండా... అప్పుడప్పుడే సెల్‌ఫోన్లు వాడుకలోకి వచ్చిన సమయంలో సాగే ప్రేమకథ మాది. ఆ సన్నివేశాలు చేస్తున్నప్పుడు మరోసారి గతంలోకి వెళ్లొచ్చిన అనుభూతి కలిగింది. ఇందులోని ప్రేమకథలన్నీ కూడా శీతాకాలంలోనే సాగుతాయి. అందుకే ఆ పేరు పెట్టారు. శీతాకాలం ఇష్టమా అని నన్ను వ్యక్తిగతంగా అడిగితే...  బెంగళూరులో వాతావరణం ఎప్పుడూ శీతాకాలంలాగే ఉంటుంది. అందుకే ఇష్టం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు (నవ్వుతూ).  సత్యదేవ్‌ మంచి నటుడు. తెలుగు సంభాషణల పరంగా చాలా సాయం చేశారు’’.* కన్నడ కథానాయికలు తెలుగులో రాణిస్తుండడం బాగుంది. కన్నడలో కూడా ఇతర భాషలకి చెందిన కథానాయికలు నటిస్తున్నారు. మేం కూడా ఇతర భాషల్లో రాణించడం మేలే కదా! తెలుగులో వెంటనే సినిమా చేయాలని కాకుండా... ‘గుర్తుందా శీతాకాలం’ విడుదల తర్వాత వచ్చే కథల్నిబట్టి నిర్ణయం తీసుకుంటా. ప్రస్తుతం కన్నడలో మూడు సినిమాలు చేస్తున్నా. ఓ వెబ్‌ సిరీస్‌ చేశా. నటులకి ఏ పరిశ్రమ అయినా ఒక్కటే.  పని విషయంలో నాకైతే తేడాలేమీ కనిపించలేదు. కాకపోతే కన్నడ నా మాతృభాష కాబట్టి అక్కడ అలవోకగా నటిస్తుంటా. మిగతా భాషల్లో నటిస్తున్నప్పుడు మాత్రం సన్నివేశాల కోసం ముందస్తుగా కసరత్తులు చేయాల్సి ఉంటుందంతే’’.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని