Kantara: ‘కాంతార’కు ఎదురుదెబ్బ.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు

రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’. విశేష ప్రేక్షకాదరణ పొందిన ఈ సినిమాకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది.

Published : 30 Oct 2022 01:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విశేష ప్రేక్షకాదరణ పొందిన ‘కాంతార’ (Kantara)కు ఎదురుదెబ్బ తగిలింది. భూతకోల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే ‘వరాహ రూపం’ పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్‌ జిల్లా సెషన్స్‌ కోర్టు ఆదేశించింది. తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌కు  కాపీగా ‘వరాహ రూపం’ తీర్చిదిద్దారని పేర్కొంటూ కేరళకు చెందిన ‘థాయికుడమ్‌ బ్రిడ్జ్‌’ అనే మ్యూజిక్‌ బ్యాండ్‌ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ అనంతరం తాజాగా ఈ తీర్పు వెలువడింది. దీంతో, వారి అనుమతి లేకుండా థియేటర్లలోనే కాకుండా యూట్యూబ్‌, ఇతర మ్యూజిక్స్‌ యాప్స్‌లోనూ దీన్ని ప్రదర్శించకూడదని కోర్టు పేర్కొంది. దీన్ని తెలియజేస్తూ థాయికుడమ్‌ బ్రిడ్జ్‌ ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఈ విషయంలో తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు చెప్పింది.

ప్రకృతి - మానవాళికి మధ్య ఉండాల్సిన సంబంధాలను తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో ‘వరాహ రూపం’ పాటకు ప్రేక్షకుల నుంచి విశేషణ ఆదరణ లభించింది. భూతకోల ఆడే వ్యక్తిని పంజుర్లి దేవత ఆవహించిన సమయంలో వచ్చే ఈ పాట ప్రేక్షకుల్ని సినిమాలో లీనమయ్యేలా చేస్తోంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశాల్లో రిషబ్‌ నటనకు ఈ పాట తోడవడంతో ఆ సన్నివేశాలు మరోస్థాయికి వెళ్లాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని