kareena kapoor: హీరోలే కాదు హీరోయిన్లూ చేయగలరు..!

బాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన కథానాయికలలో కరీనా కపూర్‌ ఒకరు.

Updated : 04 Apr 2024 09:41 IST

బాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన కథానాయికలలో కరీనా కపూర్‌ ఒకరు. ప్రేమకథా చిత్రాలు, యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌..ఇలా జానర్‌ ఏదైనా సరే ప్రేక్షకులను మెప్పిస్తుందీ భామ. వెండితెరపైనే కాదు ఓటీటీలోనూ రాణించి అభిమానులను ఆకట్టుకుంది. ఇటీవలే ఆమె ఓ కీలక పాత్రలో నటించిన ‘క్రూ’ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కరీనా చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలివి.

  • మా అమ్మ నిర్ణయాలు చాలా కచ్చితంగా ఉంటాయి. మాకోసమే ఎప్పుడూ తపిస్తుంది. కుటుంబంలోని ప్రతి మహిళ ఎవరిపై ఆధారపడకూడదని తరుచూ చెప్పేది. నా సినీ జీవితంపై మా అమ్మ ప్రభావమే ఎక్కువుంది. నా కళ్లు కొంచెం నీలిరంగులో ఉండటం వల్ల..అలాంటి కళ్లు ఉన్నవాళ్లు సినీరంగంలో రాణించలేరని చాలా మంది అనేవారు. ఎందరో ఎన్నో అంటారు. వాటిని ఎప్పుడూ పట్టించుకోవద్దని అమ్మ నాకు ధైర్యాన్నిచ్చేది. 
  • ఎనిమిదేళ్ల వయసులోనే నేను మొదటిసారి సినిమా సెట్స్‌కి వెళ్లాను. అది కశ్మీర్‌లో రేఖాజీ చిత్ర షూటింగ్‌. ఆ రోజుల్లో మా తాతయ్య, రాజ్‌ కపూర్‌ కూడా చాలా రిలాక్స్‌డ్‌గా ఉండేవారు. చిత్రపరిశ్రమలో ఉన్న పెద్ద స్టార్లు వారే అని ఎప్పుడూ ఎవరూ అనుకునేవారు కాదు. నా తొలి చిత్రం ‘రిఫ్యూజీ’. ఆ సమయంలో నాకు 18ఏళ్లు. అది కాలేజ్‌లో ఉండి స్నేహితులతో పార్టీలు, స్లీప్‌ఓవర్స్‌లు చేసే సమయం. కానీ నేను వాటికి చాలా దూరంగా ఉన్నా. నటన రంగంలోకి రావాలనే కలల్ని నిజం చేసుకోవటానికి ఎన్నో త్యాగాలు చేశాను. నా జీవితం అంతా సినిమా సెట్స్‌లోనే గడిచింది. మేం అక్కడే పెరిగాం.
  • దాదాపు 25ఏళ్ల నా సినీ ప్రయాణంలో ఎన్నో అపజయాల్ని చూశాను. ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నాను. ‘జబ్‌ వీ మెట్‌’ చిత్రం విడుదలయ్యే వరకూ నా సినిమాలు బాక్సాఫీసు వద్ద అందుకున్న విజయాల కంటే వైఫల్యాలే ఎక్కువ చూశా. అందుకు ఫలితంగా ఏడాది పాటు చిత్రాలకు దూరంగా ఉన్నా. ఆ బాధను మౌనంగా భరించా. నా సినిమాలు ఎందుకు ఆడటం లేదు? తప్పు ఎక్కడుంది? అని నన్ను నేను రోజూ ప్రశ్నించుకునేదాన్ని. వాటి గురించే ఆలోచిస్తూ, ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా. నా చిత్రాలు చూసిన వాళ్లందరూ నేను బాగున్నానని అన్నారు. వారు ప్రశంసలకి ఆనందపడాలో, ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయానని బాధపడాలో అర్థం కాలేదు కొన్నిసార్లు. విజయాల కంటే పరాజయాల వల్లే అందరికీ తెలిశానేమోనని నా అభిప్రాయం.
  • నా జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం ‘జబ్‌ వీ మెట్‌’. అందులో నేను పోషించిన గీత్‌ పాత్ర అందరినీ ఆకర్షించింది. గీత్‌ తన మనసుతో ఆలోచిస్తుంది. ఆ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. ఒక ఐకానిక్‌ సినిమాగా ఇది నిలుస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు.
  • అన్నీ జానర్‌ చిత్రాలు చేయాలని అనుకుంటున్నా. అందులో భాగమే ‘క్రూ’ చిత్రం. ఇటీవల ఈ సినిమా విడుదలైంది. ఈ చిత్రానికి వచ్చే స్పందన ఎంతో ఆనందాన్నిస్తోంది. టబు, కృతి, నేను కలిసి ఈ చిత్రంలో చేసిన హంగామా అలరిస్తోంది. ఈ సినిమా మాత్రమే కాదు ఇందులోని పాటలు కూడా ఈ చిత్ర బృందానికి చాలా ప్రత్యేకం. ‘ఓషన్స్‌ లెవన్‌’, ‘ఓషన్స్‌ 8 స్పేస్‌’ సినిమాల్లో ఉన్న వినోదం ‘క్రూ’ తప్పక అందిస్తుంది. ఎప్పుడు కథానాయకులే కాదు, నాయికలు కూడా కామెడీ పండించగలరని ఈ చిత్రం తెలియజేస్తుంది(నవ్వుతూ).
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని