Kareena Kapoor: వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్‌ హీరోయిన్‌

దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్‌ నటి కరీనా కపూర్‌ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు.

Published : 27 Mar 2024 17:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘క్రూ’(Crew)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు నటి కరీనాకపూర్‌ (Kareena Kapoor). ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో తాను ఎలాంటి విషయాలు తెలుసుకున్నానన్నది చెప్పారు. ముఖ్యంగా వరుస పరాజయాలు అందుకోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘నటిగా నా ప్రయాణం మొదలై దాదాపు పాతికేళ్లు అవుతుంది. ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. నా కెరీర్‌లో విజయాల కంటే పరాజయాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ‘జబ్‌ వి మెట్‌’ కంటే ముందు నా సినిమాలు చాలావరకూ బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అయ్యాయి. ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా. ‘‘నా సినిమాలు ఎందుకు ఆడటం లేదు? అసలు సమస్య ఎక్కడ ఉంది?’’ అని ఆలోచిస్తూ ఏడ్చా. నిద్రలేని రాత్రులు గడిపా. నా సినిమాలు చూసిన వాళ్లందరూ.. నేను బాగున్నానని కామెంట్‌ చేశారు. కానీ, ఆశించిన విజయాన్ని మాత్రం అందుకోలేకపోయా. విజయాల కంటే కూడా పరాజయాల వల్లే అందరికీ తెలిశానని భావిస్తుంటా’’

‘‘కథల ఎంపిక విషయంలో ప్రత్యేకించి పలు అంశాలను పరిగణలోకి తీసుకునేదాన్ని కాదు. వచ్చిన ప్రతీ కథను అంగీకరించేదాన్ని. అన్ని చిత్రాల్లో నటించేదాన్ని. ఆయా చిత్రాల వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఆలోచించలేదు. నేను కాబట్టి వరుస పరాజయాలు తట్టుకోగలిగా. వేరేవాళ్లు అయితే దీనిని జీర్ణించుకోలేకపోయేవారు’’ అని ఆమె అన్నారు. 2000లో విడుదలైన ‘రెఫ్యూజీ’తో కరీనా నటిగా ఎంట్రీ ఇచ్చారు. 2007లో వచ్చిన ‘జబ్‌ వి మెట్‌’ ఘన విజయాన్ని అందుకుంది. ఆమె నటనకు మంచి పేరు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని