Kartik Aaryan: ఇప్పటికీ ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుంటా!

‘‘బాజీగర్‌’ సినిమా చూసిన రోజే సినీరంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా’’ అని అంటున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌.

Published : 08 Jun 2024 01:18 IST

‘‘బాజీగర్‌’ సినిమా చూసిన రోజే సినీరంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నా’’ అని అంటున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు కార్తిక్‌ ఆర్యన్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘చందు ఛాంపియన్‌’. కబీర్‌ ఖాన్‌ తెరకెక్కించారు. భారత తొలి పారాలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ జీవితం ఆధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. ‘‘ఎవరికీ లొంగని వ్యక్తి ఈ ఛాంపియన్‌’ అంటూ ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఈ నెల 14న రానుందీ చిత్రం. ఈ సందర్భంగా ఈ సినిమా విశేషాలను, రాబోయే ప్రాజెక్టుల గురించి పంచుకున్నాడు కార్తిక్‌.

  • మొదటి సారి ఈ స్క్రిప్ట్‌ విన్నప్పుడు..ఈ కథకు నాకు ఏదో తెలియని సంబంధం ఉందనే భావన కలిగింది. అనుకున్న లక్ష్యాలను సాధించాలని కలలు కనే ప్రతి వ్యక్తికి.. ఈ చందు ఛాంపియన్‌ కథ కనెక్ట్‌ అవుతుంది. మనమందరం మనలో కూడా ఒక ఛాంపియన్‌ని కలిగి ఉన్నామని.. మనం ఏ వృత్తిని ఎంచుకున్నా అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలనే సందేశాన్ని ఇందులో చూపించనున్నాం. ఓ చిన్నపట్టణంలో పుట్టి పెరిగిన నేను కూడా బాల్యం నుంచే ఎన్నో కలలు కన్నాను. అందుకేనేమో.. ఈ ప్రాజెక్టుతో ప్రయాణం చేస్తున్నన్ని రోజులు ఈ కథకు నాకు ఏదో బలమైన అనుబంధం ఉందనే భావన కలిగేది. అందుకే ఈ సినిమా ట్రైలర్‌ను నా స్వగ్రామంలో విడుదల చేశాము.
  • షారుక్‌ ఖాన్‌ నెగిటివ్‌ రోల్‌లో నటించిన ‘బాజీగర్‌’ సినిమానే నన్ను సినీరంగంలోకి అడుగుపెట్టేలా చేసింది. ఆ సినిమా చూసిన రోజే నటుడు కావాలనే బీజం నా మనసులో పడింది. ఇంతే కాదు.. ఆ సినిమాలో షారుక్‌ పోషించిన నెగిటివ్‌ రోల్‌కి నేను ఫిదా అయ్యాను. ఇప్పటికీ నేను ఆయన్నే స్ఫూర్తిగా తీసుకుంటాను. విలన్‌గా నటించడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హీరోగా మాత్రమే నటించాలనే నియమం ఏం పెట్టుకోలేదు. ఏ పాత్ర పోషించిన అది ప్రేక్షకులకు చేరువయ్యేలా ఉంటే చాలు. అన్ని పాత్రల్లో నటిస్తేనే నన్ను నేను నిరూపించుకోగలను.
  • ప్రేక్షకులను మెప్పించి, భారీ వసూళ్లను రాబడుతుందని ప్రాజెక్టు ప్రారంభించే ముందు ప్రతీసారి మేము అనుకుంటాము. కానీ కొన్ని సార్లు ఇది వర్కౌవుట్‌ కాకపోవచ్చు. సినిమా విజయం కావడానికి ఎలాంటి ఫార్ములా లేదు. నేను కథ వింటున్నప్పుడు అది నాకు నచ్చితే.. ఆ ప్రాజెక్టుతో ఎంత దూరమైన ప్రయాణిస్తా. నేను ఒక ప్రాజెక్టు ఒప్పుకున్నానంటే.. ముఖ్యంగా దాని వల్ల నిర్మాతలు లాభపడటానికే ప్రాధాన్యత ఇస్తాను. ఎప్పుడూ నిర్మాతలు నష్టపోకూడదనే కోరుకుంటాను. కామెడీ, ఫ్యామిలీ, ప్రేమకథలు.. ఇలా భిన్నమైన జానర్‌లలో, సరికొత్త దర్శకులతో కలిసి పని చేశాను. కానీ.. ప్రముఖ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ సర్‌తో నటించాలనేది నా కోరిక. కచ్చితంగా ఇది త్వరలో జరుగుతుందనే అనుకుంటున్నాను.
  • ‘చందు ఛాంపియన్‌’ తర్వాత.. త్వరలో రాబోతున్న ‘భూల్‌ భులయ్యా 3’తో పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తాను. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ చిత్రీకరణలో ఉంది. ఇందులో విద్యా మేడమ్‌తో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. ఇది నేను కొత్త కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి ఒక మంచి అవకాశం. ‘భూల్‌ భులయ్యా 2’కి ఇచ్చినంత ప్రేమను దీనికి కూడా ఇస్తారని ఆశిస్తున్నాను.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని