Aamir Khan: ఆమిర్‌ ఖాన్‌తో విడాకులు.. నేను భయపడలేదు: కిరణ్‌రావు

బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌ నుంచి విడాకులు తీసుకోవడంపై ఆయన మాజీ సతీమణి, దర్శకురాలు కిరణ్‌రావు స్పందించారు. విడాకుల విషయంలో తాను ఏమాత్రం భయపడలేదన్నారు.

Published : 07 Apr 2024 00:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) నుంచి విడాకులు తీసుకోవడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకురాలు కిరణ్‌ రావు (Kiran Rao) స్పందించారు. తన కోసం తాను టైమ్‌ కేటాయించుకోవాలనుకున్నానని తెలిపారు. ‘‘విడాకుల విషయంలో నేను ఏమాత్రం భయపడలేదు. జీవితంలో కీలకమైన నిర్ణయం తీసుకునేముందు మన కోసం మనం టైమ్‌ కేటాయించుకోవాలి. ఎంతో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నా. అందుకే బాధ పడటం లేదు. వ్యక్తిగతంగా మేమిద్దరం ధైర్యవంతులం. మా మనసులు ఒక్కటయ్యాయి. ఒకరికొకరం బాగా కనెక్ట్‌ అయ్యాం. ఒకరిపై మరొకరికి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఇప్పటికీ అది ఏమాత్రం మారలేదు. నాకంటూ కాస్త ఏకాంతం కావాలనుకున్నా. స్వతంత్రంగా జీవించాలని.. స్వతహాగా ఎదగాలనుకున్నా. ఆమిర్‌ నా ఆలోచనలను గౌరవించాడు. నన్నెంతో సపోర్ట్‌ చేశాడు’’ అని ఆమె చెప్పారు.

వివాహ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. ‘‘పెళ్లికి ముందు ఒక ఏడాది మేము కలిసేఉన్నాం. నిజం చెప్పాలంటే.. కుటుంబసభ్యుల కోసమే మేము పెళ్లి చేసుకున్నాం. వివాహ వ్యవస్థ ఎంతో గొప్పదని.. ఇద్దరు వ్యక్తులు కలిస్తే జీవితం అద్భుతంగా ఉంటుందని అప్పుడే మాకు ఎంతగానో అర్థమైంది’’ అని తెలిపారు.

దర్శక నిర్మాతగా కిరణ్‌రావుకు బాలీవుడ్‌లో మంచి పేరు ఉంది. ఆమిర్‌ఖాన్‌ నటించిన ‘లగాన్‌’కు ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశారు. 2005లో ఆమిర్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పరస్పర అంగీకారంతో సుమారు 16 ఏళ్ల వైవాహిక బంధానికి 2021లో వీరిద్దరూ స్వస్తి పలికారు. కిరణ్‌రావును వివాహం చేసుకోవడానికంటే ముందు ఆమిర్‌కు వివాహమైన విషయం తెలిసిందే. 1986లో రీనాదత్తాను వివాహం చేసుకున్న ఆయన 2002లో విడాకులు తీసుకున్నారు. రీనాదత్తా నుంచి ఆమిర్‌ విడిపోవడానికి తాను ఏవిధంగానూ కారణం కాదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కిరణ్‌ రావు చెప్పారు. ‘లగాన్‌’ టైమ్‌లో ఆమిర్‌తో తాను టచ్‌లో లేనన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని