Krishna Vamsi: అందుకే మహేశ్‌ బాబుతో మరో సినిమా కష్టం: కృష్ణవంశీ

సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ఓ అభిమాని విజ్ఞప్తి చేయగా మహేశ్‌ బాబుతో మరో సినిమా చేయడం కష్టమన్నారు దర్శకుడు కృష్ణవంశీ.

Published : 28 Feb 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: డైరెక్టర్‌ కృష్ణవంశీ (Krishna Vamsi)- హీరో మహేశ్‌ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ చిత్రం ‘మురారి’ (Murari). విడుదలై 23 ఏళ్లయినా ఇప్పటికీ ఈ సినిమా కథ, పాటల గురించి చాలామంది మాట్లాడుకుంటుంటారు. పలువురు అభిమానులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌) వేదికగా ఆ మూవీని గుర్తుచేసుకుంటూ కృష్ణవంశీ ఖాతాను ట్యాగ్‌ చేస్తుంటారు. తీరిక చేసుకుని మరీ దర్శకుడు వారి పోస్ట్‌లపై స్పందిస్తుంటారు. ఈ క్రమంలోనే.. మహేశ్‌ బాబుతో మరో సినిమా తీస్తే బాగుంటుందని కృష్ణవంశీకి ఓ అభిమాని విజ్ఞప్తి చేయగా కష్టమని చెప్పారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారంటే?

‘‘మీరు ఆణిముత్యాల్లాంటి సినిమాలు అందించగల సత్తా ఉన్నవారు. మా అభిమాన నటుడు మహేశ్‌ బాబుతో ఓ కుటుంబ కథా చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్రయత్నించండి’’ అని సదరు అభిమాని కోరారు. ‘‘మహేశ్‌ బాబు ఇంటర్నేషనల్‌ స్టార్‌ కాబోతున్నారు. అందుకే ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం కష్టమండీ’’ అని కృష్ణవంశీ అన్నారు. మరో అభిమాని ‘నిన్నే పెళ్లాడతా’ సినిమా సీక్వెల్‌ను నాగ చైతన్యతో తీస్తే చూడాలనుందని మనసులో మాట బయటపెట్టగా.. సీక్వెల్‌ చేయలేనని దర్శకుడు బదులిచ్చారు. ఎన్టీఆర్‌ హీరోగా గతంలో తాను తెరకెక్కించిన ‘రాఖీ’లాంటి సినిమాని ప్రస్తుతం ప్లాన్‌ చేస్తున్నానని, త్వరలోనే ప్రకటించే అవకాశాలున్నాయని తెలిపారు.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న #SSMB29 (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా కోసం మహేశ్‌ బాబు సన్నద్ధమవుతున్నారు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహస వీరుడి పాత్రలో ఆయన కనిపించనున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని