Cinema News: కొత్త సినిమా విశేషాలు.. సినీ ముచ్చట్లు

మా సినిమా పేరేంటో చెప్పుకోండి అంటూ అభిమానులతో కొన్ని రోజులుగా పజిల్‌ గేమ్‌ ఆడిన దర్శకుడు లవ్‌ రంజన్‌ తన కొత్త చిత్రం పేరుని ప్రకటించారు. ఈ సినిమాకి ‘తూ ఝాతీ మై మక్కర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

Updated : 15 Dec 2022 09:42 IST

పేరు పెట్టేశారు

మా సినిమా పేరేంటో చెప్పుకోండి అంటూ అభిమానులతో కొన్ని రోజులుగా పజిల్‌ గేమ్‌ ఆడిన దర్శకుడు లవ్‌ రంజన్‌ తన కొత్త చిత్రం పేరుని ప్రకటించారు. ఈ సినిమాకి ‘తూ ఝాతీ మై మక్కర్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రణ్‌బీర్‌ కపూర్‌, శ్రద్ధాకపూర్‌ జంటగా నటిస్తున్న చిత్రమిది. ఈ ఇద్దరి పాత్రల్ని పరిచయం చేస్తూ ఓ ప్రత్యేక వీడియోని కూడా పంచుకున్నారు. హోలీ కానుకగా మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


హారర్‌ ఎస్‌5

తారకరత్న, ప్రిన్స్‌, సునీల్‌, అలీ, సాయికుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఎస్‌ 5... నో ఎగ్జిట్‌’ (S5 No Exit). భరత్‌ కోమలపాటి (సన్నీ కోమలపాటి) దర్శకత్వం వహిస్తున్నారు. ఆదూరి ప్రతాప్‌రెడ్డి, దేవు శామ్యూల్‌, షేక్‌ రహీమ్‌, మెల్కి రెడ్డి గాదె, గౌతం కొండెపూడి నిర్మాతలు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల టీజర్‌ విడుదల కార్యక్రమం జరిగింది. కథానాయిక నందిత శ్వేత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ ‘‘నన్ను హారర్‌ క్వీన్‌ అని పిలుస్తుంటారు. నేను చేసిన సినిమాలు అలాంటి పేరు తీసుకొచ్చాయి. ఈ చిత్రం కూడా ప్రేక్షకుల్ని భయపెడుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘కొత్త రకమైన హారర్‌ చిత్రమిది. మణిశర్మ సంగీతం, గరుడవేగ అంజి కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం. హారర్‌ సినిమాల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం అలరిస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.


కీరవాణికి మాతృవియోగం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (Keeravani) ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి,  ప్రముఖ రచయిత కె.శివశక్తి దత్తా అర్ధాంగి భానుమతి (82) బుధవారం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుకి గురై కన్నుమూశారు. శివశక్తి దత్తా, భానుమతి దంపతులకి నలుగురు అబ్బాయిలు, ఇద్దరమ్మాయిలు సంతానం. సంగీత దర్శకులు కీరవాణి, కల్యాణ్‌ కోడూరితోపాటు శ్వేతనాగ, మల్లేశ్వరి, కాంచి, సప్తమి ఉన్నారు.  పుట్టినరోజునాడే భానుమతి కన్నుమూయడం కుటుంబ సభ్యులకి మరింత దుఃఖాన్ని నింపింది. భానుమతి అంతిమ సంస్కారాల్ని గురువారం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌లో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.


‘పఠాన్‌’కు బాయ్‌కాట్‌ సెగ

ఆమిర్‌ఖాన్‌ ‘లాల్‌ సింగ్‌ ఛడ్డా’ చిత్రంపై బాయ్‌కట్‌ హ్యాష్‌ట్యాగ్‌ నడిచిన సంగతి తెలిసిందే. అది సినిమాపై గట్టిగానే ప్రభావం చూపింది. ఇప్పుడు ఆ సెగ షారుక్‌ఖాన్‌ (Shah Rukh Khan) ‘పఠాన్‌’కు (Pathaan) తగిలింది. ఇప్పటివరకూ ఈ సినిమాకు అంతా పాజిటివ్‌గానే సాగినే ఈ చిత్రంలోని ‘బేషరమ్‌ రంగ్‌’ పాట విడుదలయ్యాకా ‘బాయ్‌కాట్‌ పఠాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటలో బికినీలో దీపికా పదుకొణె (Deepika Padukone) మోతాదుకి మించి అందాలు ఆరబోసిందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ సినిమా అమ్ముకోవడానికి ఇంతలా దిగజారాలా? అని కొందరు నెటిజన్లు స్పందిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఇంక ఎంత దూరం వెళుతుందో అని చిత్రబృందం కాస్త కంగారుగానే ఉన్నట్లు బాలీవుడ్‌ సమాచారం. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో పూర్తిస్థాయి భారీ యాక్షన్‌ చిత్రంగా ‘పఠాన్‌’ తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య జనవరి 25న రానున్న ఈ సినిమాపై షారుక్‌ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు.


ఆ సీన్‌లు సరిచేయాల్సిందే..

‘బేషరమ్‌..’ పాటపై మంత్రి తీవ్ర అభ్యంతరం

భోపాల్‌: ‘బేషరమ్‌ రంగ్‌’ పాటలో అభ్యంతరకర సీన్‌లు సరిచేయాలంటూ చిత్రబృందానికి మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా వార్నింగ్‌ ఇచ్చారు. ఆ పాటలో దీపికా పదుకొణే ధరించిన దుస్తులు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. ఈ సీన్‌లను సరిచేయకపోతే తమ రాష్ట్రంలో ఆ చిత్రం ప్రదర్శనపై ఏం చేయాలో ప్రభుత్వం ఆలోచిస్తుందని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం ఇండోర్‌లో విలేకర్లతో మాట్లాడుతూ.. ‘‘బేషరమ్‌ రంగ్‌ పాటలో దీపికా పదుకొణె కాస్ట్యూమ్స్‌ తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. కలుషితమైన మనస్తత్వంతో ఈ పాటను చిత్రీకరించినట్టు అనిపిస్తోంది. ఈ సీన్లను, పాటలోని దీపికా కాస్ట్యూమ్‌ను సరిచేయాలని కోరుతున్నా. లేదంటే ఈ చిత్రాన్ని మధ్యప్రదేశ్‌లో ప్రదర్శించాలో వద్దా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. జేఎన్‌యూ కేసులో తుక్డే తుక్డే గ్యాంగ్‌కు దీపికా మద్దతుదారుగా కనిపించారు’ అని మంత్రి వ్యాఖ్యానించారు. 2016లో దిల్లీలో జేఎన్‌యూలో చోటుచేసుకున్న ఘటన తర్వాత తుక్డే తుక్డే గ్యాంగ్‌ అనే పదాన్ని భాజపా తరచూ ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. రామాయణం ఇతిహాసం ఆధారంగా నిర్మించిన బాలీవుడ్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’లో హిందూ మతానికి చెందిన వ్యక్తుల్ని తప్పుగా చూపించే దృశ్యాల్ని తొలగించకపోతే చట్టపరమైన చర్యలుత ఈసుకుంటామని అక్టోబర్‌లో మంత్రి హెచ్చరించారు. అలాగే, ఈ ఏడాది జులైలో దర్శకురాలు లీనా మణిమేగలై రూపొందించిన డాక్యుమెంటరీ చిత్రం కాళీ పోస్టర్‌ వివాదాస్పదం కావడంతో ఆమెపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని