Pankaj Udhas: గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ కన్నుమూత

Pankaj Udhas: సుప్రసిద్ధ హిందీ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

Updated : 26 Feb 2024 17:05 IST

దిల్లీ: సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. పంకజ్‌ ఉదాస్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

భారతీయ సంగీత ప్రపంచంలో గజల్‌, నేపథ్య గాయకుడిగా పంకజ్‌ (Pankaj Udhas) ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు అజరామరం. 1980లో ‘ఆహత్’ అనే గజల్ ఆల్బమ్‌ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ తర్వాత ముకరర్, తర్రన్నమ్‌, మెహ్‌ఫిల్, నయాబ్ వంటి అనేక హిట్‌లను అందించారు.

ఇక సినిమా ఇండస్ట్రీలోనూ ఆయన చెరగని ముద్రవేశారు. 1970లో ‘తుమ్ హసీన్ ప్రధాన జవాన్‌’లో ‘మున్నేకి అమ్మా యేతో బాటా’ పాటతో సినీ కెరీర్‌ను మొదలు పెట్టిన ఆయన ఎన్నో హిట్‌ పాటలను పాడారు. ‘నామ్‌’లో ఆయన పాడిన ‘చిట్టీ ఆయే హై’ గీతం ఎంతగానో పాపులర్ అయింది. ‘గంగా జమున సరస్వతి’, ‘ఘాయల్‌’, ‘సాజన్‌’, ‘సాజన్‌’, ‘బేటా’, ‘దిల్‌ అష్నా హై’, ‘బాజీఘర్‌’ తదితర చిత్రాల్లో అద్భుతమైన పాటలను ఆలపించారు. లత మంగేష్కర్‌తో కలిసి ఆయన పాడిన ప్రతి ఆల్బమ్‌ సూపర్‌హిట్‌ అయింది. ‘ఘాయల్‌’లో ‘మహియా తేరా కసమ్‌’ డ్యూయెట్‌ అప్పటి యువతరాన్ని ఓ ఊపు ఊపేసింది.

పంకజ్‌ ఉదాస్‌ గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో జన్మించారు. కేశుభాయ్‌ ఉదాస్‌, జితూబెన్‌ ఉదాస్‌ తల్లిదండ్రులు. వీరికి ముగ్గురు సంతానం. అందరిలో చిన్నవాడు పంకజ్‌.  సోదరుడు మన్హర్‌ ఉదాస్‌ కూడా పలు బాలీవుడ్‌ చిత్రాల్లో పాటలు పాడారు. ఆయన రెండో సోదరుడు నిర్మల్‌ ఉదాస్‌ గజల్‌ గాయకుడు. ఇలా సోదరులు ఇద్దరూ గాయకులు కావడంతో పంజక్‌ కూడా అదే బాటలో పయనించారు. తనకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలని ఉండేదని, అయితే సంగీతంపై ఆసక్తి పెరగడంతో గాయకుడిగా మారినట్లు పంకజ్‌ ఓ సందర్భంలో పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు