Kamal Haasan: ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్‌ స్క్రిప్ట్‌ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్‌

కమల్‌హాసన్‌ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్‌’ (Uttama Villain). కమల్‌ అందించిన కథతో రమేశ్‌ అరవింద్‌ దీనిని తెరకెక్కించారు.

Updated : 18 Apr 2024 18:39 IST

చెన్నై: ‘ఉత్తమ విలన్‌’ (Uttama Villain) ఫెయిల్యూర్‌పై దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) కీలక వ్యాఖ్యలు చేశారు. కమల్‌హాసన్‌ (Kamal Haasan) హీరోగా నటించిన ఆ సినిమా వల్ల తాము ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పారు. ‘‘ఉత్తమ విలన్‌’ వల్ల మేము భారీగా నష్టపోయాం. అందుకు పరిహారంగా రూ.30 కోట్ల బడ్జెట్‌లో మాతో ఒక సినిమా చేస్తానని కమల్‌ మాటిచ్చారు. మా మధ్య ఒప్పందం కుదిరింది. ‘క్షత్రియ పుత్రుడు’, ‘విచిత్ర సోదరులు’ వంటి చిత్రం చేయాలనుకున్నాం. ఈమేరకు కమల్‌ మాకొక కథ చెప్పారు. వారం వారం కథ మార్చేస్తుండేవారు. గతంలో ఆయన అలా చేసి విజయాన్ని అందుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, నిర్మాతగా ఉండటం వల్ల అది నాకెంతో ఇబ్బందిగా మారింది. ఆయనతో మేము ‘దృశ్యం’ రీమేక్‌ చేయాలనుకున్నాం. అంగీకరించలేదు. అదే చిత్రాన్ని వేరే నిర్మాణసంస్థలో చేశారు’’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వాపోయారు.

‘ఉత్తమ విలన్‌’ ఫైనల్‌ కాపీ చూసిన తర్వాత తాను పలు మార్పులు సూచించానని లింగుస్వామి తెలిపారు. తొలుత అంగీకరించిన కమల్.. ఎలాంటి మార్పులు చేయకుండానే దానిని విడుదల చేయమన్నారని చెప్పారు. ‘ఉత్తమ విలన్‌’ వల్ల తాము లాభాలు చూశామంటూ ఇటీవల ఓ యూట్యూబ్‌ ఛానల్‌లో వచ్చిన కథనాలను ఖండిస్తూ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్‌ సంస్థ తాజాగా స్టేట్‌మెంట్‌ విడుదల చేసింది. ఆ కథనాల్లో నిజం లేదని పేర్కొంటూనే ఇలాంటి అవాస్తవాలను వ్యాప్తి చేయొద్దని తెలిపింది.

కమల్‌హాసన్‌ హీరోగా రమేశ్‌ అరవింద్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఉత్తమ విలన్‌’. జయరాం, కె.బాలచందర్‌, ఆండ్రియా, పూజాకుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కమల్‌హాసన్‌ దీనికి కథ అందించారు. తిరుపతి బ్రదర్స్‌, రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మించాయి. 2015లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని