Mammootty: మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్‌’ దర్శకుడు

మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్‌ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు.

Updated : 19 Apr 2024 13:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘పందెం కోడి’, ‘ఆవారా’ చిత్రాలతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు లింగుస్వామి (Lingusamy). రామ్‌ హీరోగా నటించిన ‘ది వారియర్‌’తో ఆయన తెలుగువారికి చేరువయ్యారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తొలి చిత్రం ‘ఆనందం’ షూట్‌లో ఘటనలపై స్పందించారు. మమ్ముట్టితో విభేదాలంటూ అప్పట్లో వచ్చిన కథనాల గురించి దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆయన పెదవివిప్పారు.

‘‘ఆనందం’తో నేను దర్శకుడిగా తొలి అడుగు వేశా. అందులో మమ్ముట్టి హీరో. ఆ సినిమా షూట్‌లో ఏదైనా సమస్యలు తలెత్తితే అది పూర్తిగా నా వల్లేనని భావిస్తున్నా. అప్పుడు నాకు ఇండస్ట్రీ కొత్త. అన్ని విషయాల్లో కచ్చితంగా ఉండేవాడిని. కానీ, ఆయనకు ఎన్నో చిత్రాల్లో నటించిన అనుభవం ఉంది. ఆయన ఇచ్చిన సలహాలు నేను పాటించాల్సింది. ఆయన కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఏదీ మనసుకు తీసుకోరు. ఇప్పటికీ ఆయనతో మాట్లాడుతున్నా. ‘భ్రమయుగం’ ట్రైలర్‌ చూశాక ఫోన్‌ చేసి చాలా బాగుందన్నా. ఆ స్థాయిలో ఉండి ‘కాదల్‌-ది కోర్‌’ లాంటి చిత్రాన్ని ఎవరు చేయగలరు? అని చెప్పా. దానికి ఆయన ఎలాంటి పాత్రలోనైనా నటించాలనే తపన ప్రతి ఒక్కరికీ ఉండాలని.. అప్పుడే గొప్ప సినిమాలు వస్తాయని బదులిచ్చారు’’ అని తెలిపారు. 

ఇదే ఇంటర్వ్యూలో కమల్‌హాసన్‌ హీరోగా తాను నిర్మించిన ‘ఉత్తమ విలన్‌’ వల్ల ఆర్థికంగా నష్టపోయానని లింగుస్వామి చెప్పారు. ఆ సినిమా ఫైనల్‌ కాపీ చూసి కొన్ని మార్పులు సూచించానని.. కమల్‌ వాటిని పట్టించుకోలేదన్నారు. ‘‘ఉత్తమ విలన్‌’ వల్ల మేం భారీగా నష్టపోయాం. అందుకు పరిహారంగా రూ.30 కోట్ల బడ్జెట్‌లో మాతో ఒక సినిమా చేస్తానని కమల్‌ మాటిచ్చారు. కథ కూడా చెప్పారు. ప్రతి వారం కథ మార్చేస్తుండేవారు. ఆయనతో మేం ‘దృశ్యం’ రీమేక్‌ చేయాలనుకున్నాం. అంగీకరించలేదు. అదే చిత్రాన్ని వేరే నిర్మాణసంస్థలో చేశారు’’ అని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని