Manchu Vishnu: రేవ్‌ పార్టీలో హేమ.. ఆమెపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్న మంచు విష్ణు

రేవ్‌ పార్టీలో హేమ ఉన్నారంటూ వస్తున్న వార్తలపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

Published : 26 May 2024 00:06 IST

హైదరాబాద్‌: బెంగళూరు రేవ్‌ పార్టీకి సంబంధించి రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. సినీ నటి హేమ (Hema) రేవ్‌ పార్టీలో ఉన్నారంటూ బెంగళూరు సిటీ కమిషనర్‌ స్వయంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు (Manchu Vishnu) కూడా స్పందించారు. ఆమెపై సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని విష్ణు ఖండించారు. ఈమేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు.

‘‘సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియా సంస్థలు, వ్యక్తులు హేమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. ఒక తల్లిగా, భార్యగా ఉన్న ఆమెపై లేని వదంతులు సృష్టించడం, వ్యక్తిగతంగా దూషించడం తగదు. నిర్ధారణ లేని, ధ్రువీకరించని సమాచారాన్ని ప్రచారం చేయడం మానుకోవాలి. హేమ దోషిగా రుజువయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. అలాగే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలను ఖండిస్తుంది. హేమకు సంబంధించిన కచ్చితమైన ఆధారాలను పోలీసులు అందిస్తే ‘మా’ అసోసియేషన్ తగిన చర్యలు తీసుకుంటుంది. అప్పటివరకు హేమపై నిరాధారమైన ఆరోపణలను సంచలనాల కోసం ప్రసారం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

రేవ్‌ పార్టీపై పోలీసులు దాడి చేయగానే, ‘నేనేమీ ఆ పార్టీకి హాజరుకాలేదు’ అంటూ నటి హేమ ఓ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దానిపై బెంగళూరు పోలీసులు వివరణ ఇచ్చారు. ‘రేవ్‌ పార్టీతో నాకేమీ సంబంధం లేదు. కావాలని నా పేరు ప్రచారం చేస్తున్నారు’ అని ఆమె తప్పుడు ప్రచారానికి దిగారని పోలీస్‌ కమిషనర్‌ దయానంద్‌ వివరించారు. ఆమె ఆ కార్యక్రమానికి హాజరైనట్లు విలేకర్ల సమావేశంలో ఆధారాలు విడుదల చేశారు. తెలుగు సినీరంగానికి చెందిన కొందరు నటులు, బుల్లితెర నటులు, మోడల్స్, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నేతల కుటుంబీకులు హాజరైనట్లు గుర్తించామని చెప్పారు. మరోవైపు ఈ కేసులో నటి హేమకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈనెల 27న సీసీబీ ఎదుట హాజరుకావాలని ఆ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. హేమ సహా 86 మందికి నోటీసులు జారీ చేశారని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు