Guntur Kaaram: గుంటూరు కారం చిత్రానికి ఆ మలయాళ మూవీతో లింక్‌ ఉందా?

Guntur Kaaram: మహేశ్‌బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రాబోతున్న ‘గుంటూరు కారం’పై సోషల్‌మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Updated : 08 Jan 2024 18:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం చిత్ర బృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. కథ పూర్తి స్థాయిలో తెలియకుండా చాలా పకడ్బందీగా ట్రైలర్‌ను కట్‌ చేశారు. అయితే, దీన్ని చూసిన తర్వాత చాలా మందికి మలయాళంలో మమ్ముట్టి సినిమా గుర్తు వచ్చిందని అంటున్నారు.

ట్రైలర్‌ను బట్టి చూస్తే, వసుంధర (రమ్యకృష్ణ) తన పెద్ద కొడుకు రమణ (మహేశ్‌బాబు)ను చిన్నప్పుడే వదిలేస్తుంది. అనాథగా పెరిగిన అతడితో పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. కొన్నేళ్ల తర్వాత అనుకోని పరిస్థితుల కారణంగా ఇద్దరూ కలుస్తారు. మరి వాళ్లిద్దరూ తల్లీకొడుకులని ఎలా తెలిసింది? వసుంధరకు ఎదురైన సమస్యలను రమణ ఎలా పరిష్కరించాడు? తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.

2005లో మమ్ముట్టి నటించిన ‘రాజమాణిక్యం’ (Rajamanikyam) మూవీ కూడా ఇలాంటి కాన్సెప్ట్‌తోనే తెరకెక్కి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. తండ్రి మరణంతో రాజమాణిక్యాన్ని అతడి తల్లి ముత్తులక్ష్మి చిన్నప్పుడే వదిలేస్తుంది. వ్యాపారవేత్త రాజారత్నం పిళ్లైని పెళ్లి చేసుకుంటుంది. తన తల్లిని వెతుక్కుంటూ రాజమాణిక్యం ఆమె ఇంటికి వెళ్తాడు. అతడిని ముత్తు లక్ష్మి కొడుకుగా అంగీకరించదు. నిజం తెలుసుకున్న రాజారత్నం పిళ్లై కొడుకుని ఆదరిస్తాడు. పూర్తి కమర్షియల్‌ హంగులతో రూపొందిన ఈ చిత్రం అప్పట్లో బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. 2008 వరకూ అత్యధిక కలెక్షన్స్‌ సొంతం చేసుకున్న మలయాళ సినిమాగా రికార్డు సృష్టించింది.

ఇప్పుడు ‘గుంటూరు కారం’ ట్రైలర్‌ చూస్తే, ఆ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. మరి ‘రాజమాణిక్యం’ను స్ఫూర్తిగా తీసుకుని త్రివిక్రమ్‌ తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేసి ‘గుంటూరుకారం’ తీశారా? లేదా ఇది సొంత కథ తెలియాలంటే సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు మాస్‌ను అలరిస్తున్నాయి. మహేశ్‌బాబు పూర్తి ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నారని అభిమానులు అంటున్నారు. ఇక ఈ చిత్రానికి సెన్సార్‌బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ ఇచ్చింది. సినిమా రన్‌టైమ్‌ 2 గంటలా 38 నిమిషాలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని