Sharwanand: ఇకపై అన్నీ మంచి రోజులే

‘‘ఎన్నికల ఫలితాల తర్వాత... తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం మొదలైంది. ‘మనమే’ చిత్రంతో మరో పండగ మొదలవుతోంది. ఆ తర్వాత ‘కల్కి’.

Updated : 07 Jun 2024 05:28 IST

- ‘మనమే’ వేడుకలో శర్వానంద్‌ 

‘‘న్నికల ఫలితాల తర్వాత... తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం మొదలైంది. ‘మనమే’ చిత్రంతో మరో పండగ మొదలవుతోంది. ఆ తర్వాత ‘కల్కి’. ఇక నుంచి అన్నీ మంచి రోజులే’’ అన్నారు శర్వానంద్‌. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మనమే’. కృతిశెట్టి కథానాయిక. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహించారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. శర్వానంద్‌ మాట్లాడుతూ ‘‘చాలామంది నేను కనిపించినప్పుడంతా  ‘మహానుభావుడు’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘రన్‌ రాజా రన్‌’ తరహా సినిమాలు చేయమని కోరేవారు. నాకూ కొత్తగా చేయాలనే ఉంటుంది. వినోదంతో కూడిన ఓ మంచి కథలో నటించాలనుకున్నప్పుడు శ్రీరామ్‌ ఆదిత్య చెప్పిన ఈ కథ గుర్తొచ్చింది. ‘మనమే’ కొత్త తరహా క్యారెక్టరైజేషన్‌తో కూడిన కథ. మనిషికీ మనిషికీ ఇవ్వగలిగే గొప్ప బహుమానం సమయం. శ్రీరామ్‌ ఆదిత్య  ఆ అంశం చుట్టూ అల్లిన ఈ కథ చాలా బాగుంటుంది. చివరి 40 నిమిషాలు ప్రేక్షకుల్ని ఇంకో ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఎంతో ప్రేమించి ఈ సినిమా తీశాం. ప్రేమ ఉన్నప్పుడు గొడవలు ఉంటాయి. శ్రీరామ్, నేను గొడవలు పడుతూ ఈ సినిమాకి పనిచేశాం. తను పెద్ద దర్శకుడు అవుతాడని కెరీర్‌ ఆరంభం నుంచీ చెబుతూనే ఉన్నా. ఈ సినిమా విజయోత్సవంలో మరిన్ని విషయాలు మాట్లాడతా. ఈ వేడుకని మేం పిఠాపురంలో చేయాలనుకున్నాం. కానీ అనుమతులు దొరకలేదు. విజయోత్సవాన్ని మాత్రం అక్కడే చేస్తాం. ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్న చంద్రబాబు నాయుడు సర్‌కు, హ్యాట్రిక్‌ కొట్టిన బాలకృష్ణ సర్‌కు, పిఠాపురం ఎమ్మెల్యే పవన్‌ కల్యాణ్‌ సర్‌కు అభినందనలు’’ అన్నారు.

నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ సినిమా అద్భుతంగా ఉంటుంది. శర్వానంద్‌ నటన, తన ఛార్మింగ్‌ లుక్స్‌ చూశాక ఇకపై తనని ఛార్మింగ్‌ స్టార్‌ అనే పేరుతో పిలవాలని నిర్ణయించుకున్నా’’ అన్నారు.  దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య మాట్లాడుతూ ‘‘ఈ సినిమా నాకు ఓ పెద్ద కల. ఇది సాకారం కావడానికి సాయం చేసిన నా బృందానికి కృతజ్ఞతలు. శర్వానంద్‌ తన హుషారైన నటనతో ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాడు. ఇప్పటికే సినిమాని 56సార్లు చూశా. చూసిన ప్రతిసారీ విజిల్‌ కొడుతున్నా. శర్వా పాత్రతో ప్రేమలో పడిపోయా. మనల్ని మనం నమ్మి నిలబడితే ఏ స్థాయిలో జవాబు వస్తుందో పవన్‌కల్యాణ్‌ నిరూపించారు. అదే స్ఫూర్తితో మేమంతా ఈ కథని నమ్మి చేశాం. ఈ పండగ వాతావరణాన్ని కొనసాగించే ఓ మంచి సినిమా ‘మనమే’ అవుతుంది. కుటుంబంతో కలిసి ఈ సినిమాని చూస్తే గొప్ప అనుభూతి చెందుతార’’న్నారు. కథానాయిక కృతిశెట్టి మాట్లాడుతూ ‘‘కుటుంబ ప్రేక్షకులతోపాటు, యువతరం కూడా ఆస్వాదించే చిత్రమిది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయిరాజేశ్, కిశోర్‌ తిరుమల, పంపిణీదారుడు శశిధర్‌ రెడ్డి, నిర్మాత వివేక్‌ కూచిభొట్ల, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత కృతిప్రసాద్, తులసి, విక్రమాదిత్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు