Manchu Manoj: పేదలకు అండగా నిలిచే వారికి ఓటు వేయండి.: మనోజ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటు హక్కు వినియోగించుకోవడంపై నటుడు మంచు మనోజ్‌ (Manchu Manoj) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులిచ్చారని కాకుండా ఆలోచించి ఓటు వేయమన్నారు.

Updated : 20 Mar 2024 14:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మోహన్‌బాబు విశ్వవిద్యాలయ వార్షికోత్సవం, ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. నటులు మోహన్‌లాల్‌, ముఖేశ్‌ రుషి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మంచు మనోజ్‌ (Manchu manoj) ఓటు హక్కుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘అందరితో కలిసి ముందుకు వెళ్తున్నాడా? ఏమైనా దారుణాలకు పాల్పడుతున్నాడా? అనేది విశ్లేషణ చేసి పది మందితో కలిసి ముందుకు సాగే సరైన లీడర్‌ను ఎన్నుకోండి. కుటుంబానికి, చుట్టుపక్కల వాళ్లకే సాయం చేయలేని వారు మీకేం హెల్ప్‌ చేస్తారు. అది గుర్తు పెట్టుకుని.. మీకు, మీ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు ఎవరు వస్తే అండగా ఉంటారో విశ్లేషించి ఓటు వేయండి. డబ్బులిచ్చారని వేయొద్దు. మీకు నచ్చిన వాళ్లను ఎన్నుకోండి’’ అని మనోజ్‌ అన్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘‘ప్రతి నాయకుడిగా నేనూ ఎన్నో సినిమాల్లో చేశా. ఇప్పటికీ విలన్‌ పాత్రల్లో నటించడమంటే  ఇష్టం. విలన్‌ పాత్రల్లో నటనకు స్కోప్‌ ఎక్కువగా ఉంటుంది. నా మిత్రుడు మోహన్‌లాల్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన నటించిన ‘చిత్రం’ను తెలుగులో ‘అల్లుడుగారు’గా తీసి విజయాన్ని అందుకున్నా. ఆనాటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాం. ‘కన్నప్ప’లో యాక్ట్‌ చేసినందుకు ఇప్పటివరకూ ఆయన ఒక్క రూపాయి తీసుకోలేదు’’

‘‘కులమతాలకు అతీతంగా విద్య అందించాలనే ఉద్దేశంతో విద్యాసంస్థలు ప్రారంభించా. అది అంచెలంచెలుగా ఎదిగి విశ్వవిద్యాలయంగా మారింది. పాండిబజార్‌లో ఉన్నప్పుడు ఇడ్లీ తినడానికి కూడా డబ్బుల్లేక నీళ్లు తాగి నిద్రపోయిన రోజులు నాకింకా గుర్తున్నాయి. నాకున్న దానిలో పిల్లల చదువు కోసం ఇవ్వాలనుకుని విద్యాసంస్థలు మొదలుపెట్టా’’

‘‘ఒక్కొక్కసారి ఆలోచించి కూడా మనం తప్పు చేస్తాం. ఎవరికి ఓటు వేయాలనేది మనం నిర్ణయించుకోలేం. స్థానిక రాజకీయ పార్టీల గురించి నేను మాట్లాడటం లేదు. భారత ప్రధానిగా మరోసారి మోదీ వస్తేనే ఈ దేశం మరింత వృద్ధి చెందుతుందని నమ్ముతున్నా. ఆలోచించి ఓటు వేయండి. అన్ని పార్టీలు డబ్బులిస్తాయి. అవి మనవే. లంచాల రూపంలో తీసుకున్నవే. మనసుకు నచ్చినవాళ్లకు ఓటు వేసి దేశ భవిష్యత్తు కోసం యువత సహకరించండి’’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని