Manoj: ఆ వివాదం గురించి.. వాళ్లనే అడగండి: మంచు మనోజ్‌

ఇటీవల జరిగిన వివాదంపై మంచు మనోజ్‌ (Manchu Manoj) స్పందించారు. ఓ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన దానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 27 Mar 2023 17:27 IST

హైదరాబాద్‌: గత కొన్ని రోజులుగా మంచు బ్రదర్స్‌ వివాదం ఇంటర్నెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.  మంచు విష్ణు గొడవపడుతున్న వీడియోను మనోజ్‌ (Manchu Manoj) సోషల్‌మీడియాలో పెట్టడంతో  వైరల్‌గా మారింది. తాజాగా ఈ వివాదంపై మంచు మనోజ్‌ స్పందించారు. ఓ సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన మనోజ్‌ను ఈ వివాదం గురించి ప్రశ్నించగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

‘‘ఆ వివాదం గురించి నాకంటే ఓ ప్రముఖ ఛానల్‌కే ఎక్కువ తెలుసు. వాళ్లను అడిగితే చెబుతారు. నేను త్వరలోనే కొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తున్నా. వచ్చే నెల మొదటి వారంలో దానికి సంబంధించిన వివరాలు ప్రకటిస్తా. మీ అందరూ ఆదరించాలి. మీ దీవెనలు నాకు కావాలి.  నాకు సినిమాలే జీవితం. సినిమా లేకపోతే నాకేం లేదు. మళ్లీ సినిమాల వైపే వస్తున్నా. తాజాగా కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆ దేవుడి దీవెనలతో పాటు మీ అందరి ఆదరణ కూడా కావాలి’’ అని మంచు మనోజ్‌ అన్నారు.

ఇటీవల మంచు మనోజ్‌ ఓ వీడియో షేర్‌ చేసిన విషయం తెలిసిందే. అందులో మంచు విష్ణు (Manchu Vishnu) ఆగ్రహంగా ఉన్నట్లు కనిపించారు. ఇక మనోజ్‌ ఆ వీడియోను ఉద్దేశిస్తూ ‘‘ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండీ ఇది ఇక్కడి పరిస్థితి’’ అని  చెప్పారు. అయితే ఈ వీడియో పెట్టిన కొద్ది నిమిషాలకే ఆయన దానిని తొలగించడం గమనార్హం. ఆ తర్వాత కొన్ని కొటేషన్స్‌ను ట్విటర్‌లో పంచుకున్నారు.‘కళ్ల ముందు జరిగే తప్పులు చూసి కూడా స్పందించకుండా బతికే కన్నా, పోరాడుతూ చావడానికైనా సిద్ధం’ అని సూజీ కాస్సెమ్‌ కొటేషన్‌ను షేర్‌ చేశారు. అలాగే ‘ప్రతికూల ఆలోచనలే సృజనాత్మకతకు నిజమైన శత్రువు’ అని డేవిడ్‌ లించ్‌ కొటేషన్‌ కూడా పంచుకున్నారు. దీంతో పాటు ‘మీరు బతకండి, ఇతరులను కూడా బతకనివ్వండి’ అంటూ నమస్కారం, లవ్‌ సింబల్‌ ఎమోజీని షేర్‌ చేశారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని