Mani Ratnam: కమల్‌ హాసన్‌తో మరో సినిమా అందుకే 37 ఏళ్లు పట్టింది: మణిరత్నం

కమల్‌ హాసన్‌తో కలిసి మరో సినిమా తీసేందుకు ఆలస్యానికి గల కారణాన్ని మణిరత్నం (Mani Ratnam) వివరించారు. ‘థగ్‌లైఫ్‌’ చరిత్ర సృష్టిస్తుందన్నారు.

Updated : 11 Jan 2024 16:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కమల్‌ హాసన్‌ (Kamal Haasan) లాంటి అగ్ర హీరోతో సినిమా తీయాలంటే ఆయన స్థాయికి తగిన కథ ఉండాలని దర్శకుడు మణిరత్నం అన్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 37 ఏళ్ల తర్వాత ‘థగ్‌లైఫ్‌’ (ThugLife) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ మల్టీస్టారర్‌గా ఇది రానుంది. తాజాగా ఓ అవార్డు వేడుకలో పాల్గొన్న మణిరత్నం దీని గురించి మాట్లాడారు.

‘‘కమల్ హాసన్‌తో మరో సినిమా తీసేందుకు 37ఏళ్లు పట్టింది. ఇండస్ట్రీలో మల్టీ టాలెంటెడ్‌ నటుల్లో ఆయన ఒకరు. చిన్న కథలను ఆయనతో తీయకూడదు. తన స్థాయికి తగిన కథ ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని సంప్రదించాలి. ఇప్పుడు మేము ‘థగ్‌లైఫ్‌’తో మరోసారి చరిత్ర సృష్టించనున్నాం. కొన్ని కథలకు కొత్తవాళ్లు అయితేనే బాగుంటుంది. అందుకే కొత్త హీరోలతో సినిమాలు చేస్తాం. నేను ఎవరినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని సినిమాలు చేయలేదు. నా కథకు అవసరం కాబట్టే కొత్త వారికి అవకాశమిచ్చాను’ అని తెలిపారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న షారుక్‌ఖాన్‌కు మణిరత్నంకు మధ్య జరిగిన సరదా సంభాషణ సోషల్ మీడియాలో ప్రస్తుతం నవ్వులు పూయిస్తోంది. ‘‘దిల్‌ సే’ తర్వాత నాతో మరో సినిమా చేయాలని మణిరత్నంను ఎన్నోసార్లు వేడుకొన్నాను. కానీ, ఆయన ఇంత వరకు నాకు ఏ విషయం చెప్పలేదు. ఆయన ఓకే అంటే ఈసారి ట్రైన్‌పై కాదు.. విమానంపైన కూడా ‘చయ్యా చయ్యా’ పాటకు డ్యాన్స్‌ చేస్తా’ అని షారుక్‌ చెప్పారు. దీనికి మణిరత్నం సరదాగా స్పందించారు.. ‘నువ్వు విమానం కొన్న తర్వాత ప్లాన్ చేద్దాం’ అన్నారు. వెంటనే కొనేద్దామంటూ షారుక్‌ నవ్వుతూ సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని