Manoj Bajpayee: నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్‌ బాజ్‌పాయ్

‘సైలెన్స్‌ 2’ ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్‌ బాజ్‌పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

Published : 19 Apr 2024 18:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకప్పుడు నటీనటుల రవాణా ఖర్చులకు నిర్మాతలు డబ్బు చెల్లించేవారని.. ఇప్పుడు ఆపేయడం బాధాకరమన్నారు బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌ (Manoj Bajpayee). ఆయన తాజా చిత్రం ‘సైలెన్స్‌ 2’ ప్రమోషన్‌లో పాల్గొని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈసందర్భంగా తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు.

‘అప్పట్లో రవాణా ఖర్చులకు ఇచ్చే డబ్బులు చాలా ఉపయోగపడేవి. వాటిని ఎలా ఖర్చు చేయాలా అని ఆలోచించి ప్లాన్‌ చేసేవాళ్లు. ఇప్పుడు పూర్తిగా ఇవ్వడం మానేశారు. అది బాధాకరం. ఇంటినుంచి బయటకు వచ్చి ప్రదర్శనలు ఇచ్చే నటీనటులకు రవాణా, పెట్రోల్‌ కోసం డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నేను నటించిన తొలి సినిమాకు అన్ని ఖర్చులకు కలిపి రూ.10,000 చెక్‌ ఇచ్చారు’ అని చెప్పారు.

రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ నటించిన ‘సత్య’ సినిమా సన్నివేశం గురించి కూడా మాట్లాడారు. ‘‘సత్య’ కథ చెప్పారు కానీ, ఏ సన్నివేశం ఎప్పుడు చేయాలని చెప్పలేదు. లొకేషన్స్‌ కూడా అప్పటికప్పుడు నిర్ణయించేవారు. ఒకసారి రైల్వే బ్రిడ్జిపై షూట్‌ చేయడానికి తెల్లవారుజామున అనుమతి లభించింది. అర్ధరాత్రి ఫోన్‌ చేసి చెప్పారు. ఆ రోజు షూటింగ్‌లో సన్నివేశాలు ఏంటని అడిగితే రామ్‌గోపాల్‌ వర్మ పెద్దగా అరిచారు. ‘చెప్పింది చేయండంతే.. షటప్‌’ అని పెద్దగా కేకలు వేశారు. కానీ, క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కిన ‘సత్య’ హిందీ సినిమా రూపురేఖలను మార్చింది. డైలాగులు రాసే విధానం, స్క్రీన్‌ప్లే అన్నింటిలోను మార్పు వచ్చింది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం ఆ చిత్రమే’ అని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని