miral ott: ఓటీటీలోకి వచ్చేస్తున్న భరత్‌ హారర్ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో హారర్‌ థ్రిల్లర్‌ సిద్ధమైంది.

Published : 05 Jun 2024 16:50 IST

హైదరాబాద్‌: భాషతో సంబంధం లేకుండా క్రైమ్‌, సస్పెన్స్‌, హారర్‌, థ్రిల్లర్‌ మూవీలను ఓటీటీల్లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా ఓటీటీ సంస్థలు సైతం ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను మిగిలిన భాషల్లోకి అనువాదం చేస్తున్నాయి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి మరో హారర్‌ థ్రిల్లర్‌ సిద్ధమైంది. ఎం.శక్తివేల్‌ దర్శకత్వంలో భరత్‌, వాణి భోజన్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మిరల్‌’ (Miral ott). 2022లో తమిళంలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. తెలుగులో గత నెలలో విడుదలైంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో జూన్‌ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: హరి (భరత్‌), రమ (వాణి భోజన్‌) వారి ఐదేళ్ల కుమారుడితో కలిసి చెన్నైలో నివాసం ఉంటారు. మానసిక సమస్యతో బాధపడే రమకు తరచూ ఒక కల వెంటాడుతూ ఉంటుంది. ముఖానికి మాస్క్‌ ధరించిన వ్యక్తి తన భర్తను చంపుతున్నట్లు కలగంటుంది. అంతేకాదు, తనతో పాటు, తన కుమారుడు ఓ నిర్మాన్యుష్య ప్రదేశంలో ఎటూ దిక్కుతోచక ఉండిపోయినట్లు  భావిస్తుంది. ఒకరోజు ఘోరప్రమాదం నుంచి హరి తప్పించుకుని ప్రాణాలతో బయటపడతాడు. ఈ పరిస్థితుల్లో తన భార్య రమ, కుమారుడిని తీసుకుని కొంతకాలం సొంతూరుకు వెళ్తాడు. మరి అక్కడకు వెళ్లాక హరికి తెలిసిన నిజాలు ఏంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? రమకు వచ్చే కల నిజమైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని